ఏలూరు టౌన్: సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబు కుట్రపూరిత రాజకీయానికి చెంపపెట్టుగా భావించాలనీ వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ అన్నారు. బీసీలను మభ్యపెట్టేందుకు, మరోసారి మోసం చేసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైందనీ.. ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేమని రుజువైందన్నారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చెప్పుకునే చంద్రబాబుకు రాజ్యాంగ నిబంధనలు తెలియవా? అని ఆయన ప్రశ్నించారు. బీసీ ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు చేసిన ‘చంద్ర’ నాటకాన్ని ప్రజలంతా గుర్తించాలన్నారు. చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారని, అప్పుడైనా వారికి బీసీ రిజర్వేషన్లపై వినతిపత్రం ఇచ్చారా? వారికి నచ్చజెప్పి షెడ్యూల్ 9లో చేర్చేలా కృషి చేస్తే బీసీ సంఘాలు హర్షించేవన్నారు. అయితే కోర్టు తీర్పు పేరుతో బీసీలను మోసం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు.


