ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ట్రైనీ మీడియేటర్లు మధ్యవర్తిత్వంలో మరిన్ని మెలకువలు తెలుసుకోవాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి సూచించారు. శుక్రవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ట్రైనీ మీడియేటర్లకు ఒక రోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని రిఫరల్ న్యాయమూర్తులకు, అనంతరం 102 ట్రైనీ మీడియేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం 3.0 మధ్యవర్తిత్వ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో మీడియేటర్లకు మరింత నైపుణ్యం పెంపొందించడం ద్వారా కేసుల పరిష్కారం మరింత సులభతరం అవుతుందన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదనపు జిల్లా న్యాయమూర్తులు, సీనియర్స్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, ఎంసీపీసీ, చైన్నెకు చెందిన మాస్టర్ ట్రైనర్ సుదర్శన్ సుందర్, ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొనే సీతారాం పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఐదో రోజు శిబిరాన్ని ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోనే సీతా రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులపై ఇటీవల దాడులు పెచ్చుమీరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాల ప్రాంగణాల్లోనే న్యాయవాదులపై హత్యాయత్నాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కురువయ్యాడన్నారు. ఇటువంటి దాడులను అరికట్టడానికి న్యాయవాదులు రక్షణ చట్టం అమలు చేయడం ఒక్కటే పరిష్కారమన్నారు. న్యాయవాదులు జీపీ డానియల్, నోముల రాముడు, పి.రత్న రాజు, ఎం.గోపాలరావు, టీఎస్ శర్మ, చోడే శ్రీనివాస్, బి.అప్పల రెడ్డి, ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రానున్న ఖరీఫ్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధా న్యం సేకరించాలని జేసీ ఎంజే అభిషేక్ గౌడ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని శుక్రవారం జిల్లా ప్రొక్యూర్‌మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో ఎల్‌నినో పరిస్థితుల కారణంగా ధాన్యం దిగుబడి తగ్గే అవకాశం ఉందని, ఈ మేరకు సేకరణ లక్ష్యాన్ని నిర్ణయించాలన్నారు. ధాన్యం కొనుగోలు కోసం గుర్తించిన రైస్ మిల్లుల్లో గోనె సంచుల నాణ్యత తనిఖీ చేయాలన్నారు. అలాగే వాహనాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను వేగిరపర్చాలన్నారు. 1000 కంటే ఎక్కువ ట్రక్కుల రిజిస్ట్రేషన్‌కు చర్యలు తీసుకోవాలన్నారు. రైస్ మిల్లర్లు, రవాణా వాహనాల అసోసియేషన్, రైతు సంఘం నాయకులతో ఈనెల 13న సమావేశం, ధాన్యం సేకరణ విధులు నిర్వహించే సిబ్బందికి ఈనెల 14న శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదే శించారు. టోల్–ఫ్రీ కంట్రోల్ రూమ్ 18004256453, జిల్లా కంట్రోల్ రూమ్ 7702003584 నంబర్లపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. డీఎస్‌ఓ బాబు విలియమ్స్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరామమూర్తి, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కరీమ్, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీదేవి, సహకార శాఖ అధికారులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులను తనిఖీ చేసేందుకు సౌత్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ శుక్రవారం తాడేపల్లిగూడెం విచ్చేశారు. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన్ను కలిసి పలు అంశాలపై చర్చించారు. తాడేపల్లిగూడెంలో వందే భారత్, పలు సూపర్‌ఫాస్ట్ రైళ్లు ఆపకపోవడంతో ప్రయాణికులు అసంతృప్తిగా ఉన్నారన్నారు.


