మిట్టగూడెం.. మూత్రగండం | - | Sakshi
Sakshi News home page

మిట్టగూడెం.. మూత్రగండం

Oct 9 2026 12:56 AM | Updated on Oct 9 2026 12:56 AM

● కలవరపెడుతున్న కిడ్నీ వ్యాధులు

● డయాలసిస్‌ చేయించుకుంటున్న బాధితులు

● హద్దు దాటి క్రియేటినిన్‌ స్థాయి

కుక్కునూరు: కుక్కునూరు మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో కిడ్నీ సంబంధిత వ్యాధులు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మిట్టగూడెం గ్రామంలో 40 ఏళ్లు పైబడిన వారు ఎందరో ఈ వ్యాధులతో అల్లాడుతున్నారు. నాలుగేళ్ల వ్యవధిలోనే ఈ చిన్న గ్రామంలో సుమారు ఏడుగురు కిడ్నీ సమస్యలతో మృతి చెందారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మిట్టగూడెంతో పాటు చీరవల్లి, బర్లమడుగు, పెద్దరావిగూడెం తదితర గ్రామాల్లోనూ పలువురు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

అంతుచిక్కని కారణాలు.. పెరుగుతున్న సీరమ్‌ క్రియేటినిన్‌

బాధితుల్లో తొలుత కాళ్లు, ముఖం వాపులు రావడం, ఆపై వైద్య పరీక్షలు చేయించగా సీరమ్‌ క్రియేటినిన్‌ స్థాయిలు విపరీతంగా పెరుగుతున్నట్టు వెల్లడవుతోంది. మందులు వాడుతున్నా క్రియేటినిన్‌ స్థాయిలు తగ్గకపోవడంతో సమస్య ముదిరి చివరికి డయాలసిస్‌ చేయించుకోవాల్సిన దుస్థితి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు డయాలసిస్‌ అవసరం లేకుండా కేవలం మందులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఎలాంటి చెడు అలవాట్లు లేకపోయినా 40 ఏళ్లు దాటిన వారికి ఈ తరహా కిడ్నీ సమస్యలు రావడానికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. ప్రజల ఆహారపు అలవాట్లు, జీవనశైలి, తాగునీటి నాణ్యత లోపాలు లేదా వ్యవసాయంలో వినియోగిస్తున్న పురుగు మందుల ప్రభావం ఉందా అనే అంశంపై శాసీ్త్రయ పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

శాసీ్త్రయ పరిశోధనలు చేయాలి

సంబంధిత అధికారులు స్పందించి సమగ్ర రక్త పరీక్షలు, ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు తాగునీటి నాణ్యతను పరిశీలించి వాస్తవ కారణాలను గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. మండలవ్యాప్తంగా అసలు ఎంత మంది కిడ్నీ బాధితులు ఉన్నారో అధికార యంత్రాంగం సమగ్ర వివరాలు సేకరించి, వెంటనే ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అంటున్నారు. ముందస్తుగా వ్యాధి లక్షణాలను గుర్తిస్తే బాధితులకు తగిన వైద్యం అందించి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement