ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీటీఎఫ్ ఏలూరు జిల్లా నూతన అధ్యక్షుడిగా ప్రస్తుత జిల్లా ఉపాధ్యక్షుడు, ముదినేపల్లి హైస్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న టీ.నారాయణదాసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామారావు అధ్యక్షతన ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈవీ రామారావు హాజరయ్యారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న నారాయణదాసు మాట్లాడుతూ ప్రభుత్వం పీఆర్‌సీ కమిషన్ నియమించకుండా తాత్సారం చేస్తోందని, వెంటనే ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని లేనిపక్షంలో ఉద్యమం తప్పదన్నారు. రాష్ట్ర కార్యదర్శి బీ రెడ్డి దొర, రాష్ట్ర మాజీ కార్యదర్శి బీఏ సాల్మన్ రాజు, సబ్ కమిటీ సభ్యులు తొమ్మండ్రు ప్రకాష్, వీ.గణేష్, యూవీఎన్ రాజు, ఎస్.దొరబాబు, డీకేఎస్‌ఎస్ ప్రకాష్ రావు, మండల నాయకులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ఏఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–2 (సంస్కృతం), ఒకేషనల్ థియరీ పరీక్షలకు 3,663 మంది హాజరయ్యారు. మొత్తం 3,843 మంది విద్యార్థులకు 180 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ పరీక్షలను ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ 2 కేంద్రాల్లో తనిఖీ చేశారు. ఈ పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, ప్రశాంతంగా జరిగాయని ఆమె తెలిపారు.
జంగారెడ్డిగూడెం: వర్జీనియా వేలం ప్రక్రియ ధరల్లో మార్పు లేకపోవడంతో రైతులు ధర ఎప్పుడు పెరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు. వేలం ప్రక్రియలో బయ్యర్లు, సిబ్బంది కొరతతో షిప్ట్ పద్దతిలో వేలం నిర్వహిస్తుండగా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 5 వేలం కేంద్రాల పరిధిలో బుధవారం జంగారెడ్డిగూడెం–1, జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రాల్లో వర్జీనియా పొగాకు వేలం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం–1 వేలం కేంద్రంలో మొత్తం 182 బేళ్లు రాగా, వాటిలో 113 బేళ్లు తిరస్కరించారు. 69 బేళ్ళు కొనుగోలు చేయగా, గరిష్ట ధర రూ. 265, కనిష్ట ధర రూ.250 వచ్చింది. సరాసరి రూ.256.86గా నమోదైంది. జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రంలో 232 బేళ్లు అమ్మకానికి రాగా, 130 బేళ్లు తిరస్కరించారు. 102 బేళ్ళు కొనుగోలు చేయగా, గరిష్ట ధర రూ.265, కనిష్ట ధర రూ.255 వచ్చింది. సరాసరి ధర రూ.258.26 నమోదైంది.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత జనవరి 21 నుంచి 29 వరకూ తొలి విడత జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. రెండో విడత పరీక్షలు ఏలూరు జిల్లాలో ఒక కేంద్రంలో, పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు కేంద్రాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లాకు సంబంధించిన ఏలూరు నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్‌లో నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరంలోని డీఎన్‌ఆర్ కళాశాల, విష్ణు ఇంజనీరింగ్ కళాశాలల్లో నిర్వహించనున్నారు. తాడేపల్లిగూడెంలోని శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల, శశి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ నెల 2, 4, 5, 6, 7, 8 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానంలో విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న ఇద్దరు సెక్యూరిటీ సూపర్‌వైజర్లను ఆలయ అధికారులు బుధవారం విధుల నుంచి తొలగించారు. సెక్యూరిటీ సిబ్బందితో పనిచేయించాల్సిన సూపర్‌వైజర్లే విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో కొందరు భక్తులు, స్థానికులు ఇన్‌స్టా రీల్స్ చేస్తున్నా సూపర్‌వైజర్లు నిలువరించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. గార్డులకు విధుల కేటాయింపులో కూడా లోటుపాట్లు ఉన్నట్టు తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం శ్రీవారి కొండపైకి అన్యమత పోస్టర్లు ఉన్న వాహనం రాగా, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డు సెల్‌ఫోన్ చూసుకుంటూ, దానిని పట్టించుకోలేదు. అధికారులు సీసీ కెమెరాల ద్వారా ఈ విషయాన్ని గుర్తించి, వెంటనే అతడిని విధుల నుంచి తొలగించారు.


