ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌ | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌

Apr 2 2026 7:41 AM | Updated on Apr 2 2026 7:41 AM

నేడు
నాడు

ఏలూరు టౌన్‌: ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని సుమారు 20 ఆసుపత్రుల్లో ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఏలూరు జిల్లాలో 5, పశ్చిమగోదావరి జిల్లాలో 15 ఆసుపత్రులు సేవలు బంద్‌ చేశాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో ఈ పరిస్థితి దారుణంగా ఉంది. అత్యవసర చికిత్సలు అందక రోగుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నా, ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు అందించే హాస్పిటల్స్‌ 73 వరకు ఉన్నాయి. ఏలూరు జిల్లాలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ 33, ప్రైవేట్‌ దంత వైద్యశాలలు 10, పశ్చిమలో 30 ఎంప్యానల్‌ హాస్పిటల్స్‌ రోగులకు వైద్యచికిత్సలు అందిస్తున్నాయి. ఇప్పటికే 20 ఆసుపత్రులు సేవలు నిలిపివేయగా, మిగిలిన వాటిలో కూడా సేవలు ఆపేస్తే తమ పరిస్థితి ఏంటని, తమ ప్రాణాలకు భరోసా లేదని రోగులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్‌ రోగులకు కీలకమైన కీమోథెరపీ సేవలు అందక, అప్పులు చేసి కార్పొరేట్‌ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.

భారీగా పేరుకుపోయిన బకాయిలు

ఏలూరు జిల్లాలో పేదల ఆరోగ్య భరోసా నీటి మూటగా మారుతోంది. ఆరోగ్యశ్రీ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో సుమారు రూ.100 కోట్లు, పశ్చిమగోదావరిలో మరో రూ.100 కోట్లు.. మొత్తంగా రూ.200 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. 22 నెలలుగా టీడీపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ఏలూరు జిల్లాలో 2025 ఏప్రిల్‌ 1 నుంచి 2026 మార్చి 31 మధ్య సుమారు రూ.132 కోట్ల విలువైన సేవలు అందించగా, వీటిలో యాజమాన్యాలు సేవలు నిలిపివేస్తామని హెచ్చరించటం, పాక్షికంగా నిలిపివేయడంతో కొంత మేర నిధులు చెల్లించటం చేశారు.

సీఎంఆర్‌ఎఫ్‌లోనూ సిఫార్సులదే హవా

ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడుస్తున్న టీడీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్‌ఎఫ్‌ కూడా అందని ద్రాక్షలా మారింది. ఆరోగ్యశ్రీలో వైద్యం అందకపోవటం, శస్త్రచికిత్సలకు భారీగా బిల్లులు చెల్లించాల్సి రావటం రోగులకు భారంగా మారింది. టీడీపీ నేతల సిఫార్సు ఉన్నవారికే సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు మంజూరవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లో పలుకుబడి ఉన్నవారికి మాత్రమే ఈ నిధులు దక్కుతున్నాయని, ఇందులో కూడా కొందరు నేతలు వాటాలు తీసుకుంటున్నారని బాధితుల బంధువులు విమర్శిస్తున్నారు. సిఫార్సులు లేని సామాన్య రోగులు మాత్రం వైద్యం కోసం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం క్రమంగా నిర్వీర్యమవుతోంది. పేదలకు అనారోగ్యం వస్తే అప్పులు చేసి మరీ ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. శస్త్రచికిత్సలు అవసరమైన వారు దేవుడిపై భారం వేయాల్సిన దైన్యస్థితిలో ఉన్నారు. బకాయిల కారణంతో ఏప్రిల్‌ 1 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌ చేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది.

గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తృతం చేస్తూ ఏకంగా 3,257 వ్యాధులకు చికిత్సలు అందేలా బలోపేతం చేశారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షల వరకు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలకు కొండంత అండగా నిలిచారు. పేదవారికి పెద్ద రోగమొచ్చినా అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో సైతం ఉచితంగా నాణ్యమైన వైద్యం అందేది.

భారీగా పేరుకుపోయిన బకాయిలు

ఉమ్మడి పశ్చిమలో రూ.200 కోట్లకు పైగా బకాయిలు

ఆందోళనలో రోగులు, బంధువులు

సీఎంఆర్‌ఎఫ్‌లో టీడీపీ నేతల సిఫార్సులతోనే పని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement