ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు. పీఆర్‌సీ కమిషనర్‌ను వెంటనే నియమించాలని, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని, మెమో నెంబర్ 57 అమలు చేయాలని, పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రవికుమార్ అధ్యక్షతన చేపట్టారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, అధికారంలోకి వచ్చేముందు ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ ఇస్తామని హామీ ఇచ్చిన మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక బకాయిలు విడుదల చేయాలని, ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఎలను వెంటనే విడుదల చేయాలని, కేంద్ర ప్రభుత్వం మెమో 57ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏపీ జేఏసీ నాయకులు చోడగిరి శ్రీనివాసరావు, ఆర్‌ఎస్ హరినాథ్, నెరుసు రామారావు, సీఐటీయూ నాయకులు ఆర్. లింగరాజు, డీఎన్‌వీడీ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు కే. శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్1938, ఏపీటీఎఫ్ 257, ఎస్టీయూ, డీటీఎఫ్, బీటీఏ, ఆప్టా, ఏపీఎస్టీఏ, పీఆర్‌టీయూ తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు మద్దతు ప్రకటిస్తూ సంఘీభావ సందేశం తెలిపారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్పీ మనోహర్ కుమార్, బీ సుభాషిణి, జిల్లా సహాధ్యక్షులు ఎస్.సుధారాణి, జీ వెంకటేశ్వరరావు, కోశాధికారి రంగమోహన్ తదితరులు పాల్గొన్నారు.


