● టెక్నికల్ టీంను నియమించిన దేవదాయ శాఖ కమిషనర్
● వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ
ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానంలో ఇటీవల వెలుగు చూసిన రూ.200 నకిలీ టికెట్ల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, కమిషనర్లకు, జిల్లా ఎస్పీకి సీఎంఓ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. దాంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తును మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయంలో గత నెల 15న రూ.200 నకిలీ టికెట్ల విక్రయాల వ్యవహారం బయటపడింది. దీనిపై దేవస్థానం ఈఓ వై.భద్రాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై టి.సుధీర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎస్.శేషుబాబు, ఏ3 నిందితుడిగా ఉన్న సెక్యురిటీ గార్డు మేకా సతీష్ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. ఏ1 నిందితుడైన ఐఎస్‌జే రాజు ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించాడు. ఇదిలా ఉంటే రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ నకిలీ టికెట్ల స్కాంపై ఒక టెక్నికల్ కమిటీని నియమించారు. అందులో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) లిమిటెడ్ సభ్యులు, సింహాచలం దేవస్థానానికి చెందిన సిస్టం అడ్మినిస్ట్రేటర్, అన్నవరం దేవస్థానానికి చెందిన మరో సిస్టం అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు. వారం రోజుల్లోగా సంబంధిత రిపోర్టును తనకు అందించాలని కమిషనర్ కమిటీని ఆదేశించారు. మరో ఒకటి రెండు రోజుల్లో కమిటీ దేవస్థానంలో విచారణ చేపట్టనుంది. అయితే వీరు పరిశీలించాల్సిన కంప్యూటర్ సిస్టంను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. దాంతో పోలీసులు ఈ కమిటీకి సహకరిస్తారా.. లేక తామే టెక్నికల్ పరీక్షలు జరిపిస్తామని పోలీసులు చెబుతారా? అన్నది ప్రశ్నార్ధకంగా ఉంది. పోలీసులు కంప్యూటర్ సిస్టంను టెక్నికల్ టీమ్‌కు ఇవ్వకపోతే వారు దేవస్థానం వద్ద ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించడం మినహా ఏమీ చేయలేరు. ఏది ఏమైనా ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంచలనంగా మారింది.


