మార్కెట్‌లో మటన్ మంచిదేనా?
● చనిపోయిన గొర్రెలు కోసి విక్రయాలు
● రెస్టారెంట్లపై అనుమానాలు
● జిల్లాలో పశువైద్యులు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణలపై విమర్శలు
తణుకు అర్బన్: ముక్కలేనిదే ముద్ద దిగని మాంసాహారులు అత్యధికంగా ఇష్టపడేది మటన్. మాంసాహార అమ్మకాల్లో కొందరు అక్రమార్కుల కారణంగా మటన్ ముట్టుకోవాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. గత నెల 30న అత్తిలి మేకల కబేళాలో చనిపోయిన గొర్రెలను వధించి మాంసాన్ని విక్రయిస్తున్న వ్యవహారం జిల్లాలో సంచలనంగా మారింది. మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్న మటన్ మంచిదేనా అనే సందేహం మాంసాహార ప్రియుల్లో మొదలైంది. అత్తిలిలో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తిలి సెక్రటరీ జి.భాస్కరరావు కబేళాను పర్యవేక్షించి చనిపోయిన గొర్రెలను వధించారని నిర్ధారించుకున్న అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో 8 చనిపోయిన గొర్రెలను కోసిన మాంసంతో పాటు చనిపోయిన 5 గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు. సదరు మాంసాన్ని ఇరగవరం మండలం రేలంగిలో విక్రయిస్తున్నట్లుగా విచారణలో తేలింది. మార్కెట్‌లో కిలో మటన్ ధరలు రూ.వెయ్యి ఉండగా చనిపోయిన గొర్రెల మాంసం రూ.500 నుంచి రూ.550కు జిల్లాలో కొన్ని చోట్ల విక్రయిస్తున్నారు. పట్టణాల్లో ఽరూ.వెయ్యికి అమ్మకాలు చేస్తుండగా కొన్ని గ్రామాల్లో మాత్రం కొందరు రిటైల్ వ్యాపారులు రూ.500కు కూడా మటన్ విక్రయిస్తున్నారు. జిల్లాలో మటన్ విక్రయాలకు సంబంధించి ఆదివారం 1,500 కిలోలు, మంగళవారం వెయ్యి కిలోలు, మిగిలిన రోజుల్లో రోజుకు 700 కిలోల చొప్పున సుమారుగా విక్రయాలు జరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
పర్యవేక్షణపై అనుమానాలు
నిబంధనల ప్రకారం మాంస విక్రయాలకు సంబంధించి గొర్రెలు, మేకలను వధించే ముందు పశు వైద్యులు వాటి ఆరోగ్యస్థితిని నిర్ధారించి ఆరోగ్యంగా ఉన్న వాటిని మాత్రమే వధించేందుకు అనుమతి ఇవ్వాల్సి ఉంది. సదరు మాంసంపై కూడా స్టాంపు వేయాల్సి ఉంది. ఈ తరహా నిబంధనలు జిల్లాలో ఎక్కడా అమల్లో లేవనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రాత్రి 3 గంటలకే మేకల కబేళాకు చేరుకోవడం తదితర వ్యవహారం అంతా కష్ట సాధ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో పశు వైద్యులు పరీక్షలు నిర్వహించడం లేదని పలువురు చెబుతున్నారు. దీంతో మాంసం రిటైల్ విక్రయదారుల్లో కొందరు అక్రమ మార్గంలో చనిపోయిన జీవాలను వధించి విక్రయించేస్తున్నారని తెలుస్తోంది. చనిపోయిన గొర్రెల్లో రక్తం శరీరంలోనే ఇంకిపోతుందని, దాని వల్ల మాంసం త్వరగా కుళ్లిపోతుందని, అలాంటి మాంసాన్ని భుజిస్తే మనుషుల్లో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
రెస్టారెంట్లకు తక్కువ ధరకు విక్రయాలు
ముఖ్యంగా జిల్లాలోని హాటళ్లు, రెస్టారెంట్లలో అందుబాటులో ఉన్న మాంసాహారాల్లో మటన్ అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తుంటారని తెలుస్తోంది. చనిపోయిన గొర్రెల మాంసం మార్కెట్‌లో అందుబాటులో ఉండడంతో పాటు కొన్ని రోజులపాటు ఫ్రిజ్‌లలో ఉంచి మరీ రెస్టారెంట్‌లలో వండి వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అత్తిలి వ్యవహారం బయటపడిన రోజు నుంచి రెస్టారెంట్‌లు, హోటళ్లలో మటన్ రుచిచూడాలంటే భయపడుతున్నామని పలువురు చెబుతున్నారు. దీనికితోడు ఫుడ్ పాడయిందని, దుర్వాసన వస్తుందని ప్రజలు బాహాటంగా చెప్పినా కూడా అధికారులు ఎలాంటి పర్యవేక్షణలు చేయకపోవడం, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో బాధితులను పట్టించుకునే వారు లేరని వాపోతున్నారు.
దుకాణాల్లోనే కోసేస్తున్న వైనం
కొందరు రిటైల్ వ్యాపారులు మేకల కబేళాకు వెళ్లే పరిస్థితి లేకుండానే తమ దుకాణాల్లోనే గొర్రెలను వధించే దుస్థితి జిల్లాలోని చాలా చోట్ల కనిపిస్తోందని మాంసాహారులు చెబుతున్నారు. దుకాణాల్లో వెనుక భాగంలో జీవాలను వధించేసి మాంసాన్ని విక్రయిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని పలువురు వాపోతున్నారు. ఈ విషయంపై తణుకు పశు సంవర్థకశాఖ అధికారి పృథ్వీరెడ్డిని సాక్షి వివరణ కోరగా ప్రతి రోజూ తణుకు మేకల కబేళాలో జీవాలను వైద్య పరీక్షలు చేసిన తరువాత మాత్రమే వధించేందుకు అనుమతినిస్తున్నట్లు చెప్పారు.
మార్కెట్‌లో మటన్ మంచిదేనా?
మార్కెట్‌లో మటన్ మంచిదేనా?


