గౌరవ వేతనం ఏదీ?
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్, మౌజన్లు 9 నెలలుగా గౌరవ వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. వీరు నిత్యం మసీదుల్లో ప్రార్థనలు నిర్వహిస్తూ ముస్లింలలో ఆధ్మాత్మి క చింతన పెంచుతున్నారు. వీరి సేవలను గుర్తిస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతినెలా గౌరవ వేతనం ఇచ్చేలా నిర్ణయించారు. ఈ మేరకు ప్రతినెలా ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజన్‌లకు రూ.5 వేలు ఇవ్వాలని జీఓ కూడా విడుదల చేశారు. అప్పటినుంచి ప్రతినెలా క్రమం తప్పకుండా గౌరవ వేతనాన్ని అందించారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది వీరిని పూర్తిగా విస్మరించింది. దీంతో ముస్లిం సామాజికవర్గంలో తీవ్ర వ్యతిరేకత ప్రారంభంకావడంతో కొన్ని నెలలు గౌరవ వేతనాన్ని విడుదల చేసి మ రలా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నిలిపివేశారు.
జిల్లాలో 206 మసీదులు
జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాలో అసలు ఆదాయం లేని 206 మసీదులను గుర్తించి వాటిలోని ఇమామ్, మౌజన్‌లకు గౌరవ వేతనం అందించారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ఇమామ్, మౌజన్‌లకు అదనంగా రూ.5 వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఇమామ్‌లకు రూ.15 వేలు, మౌజన్‌లకు రూ.10 వేలు ఇస్తామ న్నారు. అయితే ఈ హామీని అమలు చేయకపోగా.. అప్పటికే ఇస్తున్న గౌరవ వేతనాన్ని కూడా బకాయి పెట్టారు.
బకాయిలు రూ.4.66 కోట్లు
కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ఇమామ్‌లకు రూ.15 వేలు, మౌజన్‌లకు రూ.10 వేలు నెలకు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలోని ఎంపిక చేసిన 206 మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లకు 9 నెలల బ కాయిలు కింద రూ.2.78 కోట్లు, మౌజన్‌లకు రూ.1.88 కోట్లు మొత్తం రూ.4.66 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
ఏలూరు తంగెళ్లమూడిలో నెహర్ మసీదు
మసీదుల్లో సమయానికి నమాజు ప్రార్థనలు చేసి ముస్లింలను ఆధ్యాత్మిక చింతనలో తరించేలా చేస్తున్న ఇమామ్, మౌజన్‌ల కుటుంబాలు చింతల్లో ఉన్నాయి. ఎటువంటి ఆదాయం లేక ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనంపైనే ఆధారపడిన వారి కుటుంబాలు గత 9 నెలలుగా పస్తులతో ఉండాల్సిన పరిస్థితి. ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి వెంటనే గౌరవ వేతనాలు విడుదల చేయాలి.
–మొహమ్మద్ ఇస్మాయిల్ షరీఫ్, అధ్యక్షుడు, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ
గతంలో గౌరవ వేతనం ప్రతి నెలా విడుదల చేసేవారు. దాంతో మా కుటుంబాలు తిండికి లోటు లేకుండా గడిపేవాళ్లం. ప్రస్తుతం గౌరవ వేతనం విడుదల చేయకపోవడంతో దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం వెంటనే గౌరవ వేతనాన్ని విడుదల చేసి మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించాలి.
–ఎండీ రెహమాన్ షరీఫ్, వైఎస్సార్ కాలనీ మసీదు ఇమామ్, ఏలూరు
ఇమామ్, మౌజన్‌లకు 9 నెలలుగా బకాయిలు
వేతన పెంపు హామీనీ విస్మరించిన కూటమి సర్కారు
ఉమ్మడి జిల్లాలో 206 మసీదులు
రాష్ట్ర ప్రభుత్వ బకాయి రూ.4.66 కోట్లు
గౌరవ వేతనం ఏదీ?
గౌరవ వేతనం ఏదీ?


