బౌద్ధారామాల్లో కార్తీక శోభ
కామవరపుకోట: మండలంలోని జీలకర్రగూడెం గ్రామ పంచాయతీ గుంటుపల్లిలోని బౌద్ధారామాలు కార్తీక మాసంలో భక్తులతో, పర్యాటకులతో సందడిగా మారింది. ఈ బౌద్ధారామాల వద్ద ఉన్న భారీ లింగాకారాన్ని ప్రజలు ధర్మ లింగేశ్వర దేవాలయంగా కొలుస్తారు. జగద్గురు ఆది శంకరాచార్యులు విదేశీ పర్యటనలో బౌద్ధారామంలోని ప్రధాన స్తూప చైతన్యాన్ని ధర్మ లింగేశ్వర స్వామిగా రూపాంతరం చేసి పూజలు చేశారని బౌద్ధులు చెబుతుంటారు. ఏటా కార్తీక మాసంలో తిరునాళ్లు నిర్వహిస్తారు. గట్టు తీర్థంగా ప్రసిద్ధి చెందిన ఈ తిరునాళ్ళలో మూడో సోమవారం యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. జిల్లాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి యాత్రికులు భారీగా తరలి వస్తుంటారు. ఈ ప్రాంతాన్ని పాండవులు తిరిగిన ప్రదేశంగా స్థానికులు చెప్పుకుంటారు. దీనిలో భాగంగానే ఇక్కడ రాతిపై భీముడి పాదం ఉన్నట్లుగా ప్రజల భావించి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడున్న ధర్మ లింగేశ్వర స్వామికి ప్రాణచారం పడితే సంతానం కలుగుతుందని ఈ ప్రాంత ప్రజల నమ్మకం. ప్రాణాచారం అంటే సంతానం కోసం మొక్కుకున్న మహిళలు ధర్మలింగేశ్వర స్వామి ఆలయం ఎదురుగా బోర్లగా పడుకుని తనను తాను మరిచిపోయి దైవత్వంలోకి మునిగిపోతూ నిద్రావస్థలోకి చేరుకోవడాన్ని ప్రాణాచారం అంటారు.
ప్రాణాచారంలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై తను కోరుకున్న కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. సంతానం కలగని మహిళలు తలస్నానం చేసి పండ్లు, పువ్వులు చేతితో పట్టుకుని ఈ బౌద్ధాలయం వద్ద ధర్మాలింగేశ్వరి స్వామి ఎదుట ప్రాణాచారం పడతారు. అలా ప్రాణాచారం పడిన వారికి స్వామి కలలో ప్రత్యక్షమై పండ్లు అందజేసినట్లయితే మగబిడ్డ పుడతాడని, పూలు అందజేస్తే ఆడపిల్ల పుడుతుందని, చీపురు, చాట కనబడితే వారికి సంతాన భాగ్యం లేదనేది ఈ ప్రాంత వాసుల నమ్మకం. అలా పుట్టిన పిల్లలకు మొక్కులు తీర్చి ధర్మయ్య, లింగయ్య, ఈశ్వరయ్య, ధర్మవతి, ధర్మ లక్ష్మీ ఇలా అనేక పేర్లు పెడుతుంటారు. ఈ కారణంగా అధిక సంఖ్యలో మహిళలు ప్రాణచారం పడుతుంటారు. తిరుణాల సందర్భంగా మండలంలో మూడో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తారు. ఈ ప్రాంతంలో అడపాదడపా సినిమా షూటింగ్‌లు సైతం నిర్వహిస్తుంటారు. ఈ ప్రదేశం పిక్నిక్ స్పాట్‌గా ఉండడంతో.. కార్తీకమాసంలో అధిక సంఖ్యలో పాఠశాలల విద్యార్థులు వస్తుంటారు.
బౌద్ధారామాల్లో కార్తీక శోభ
బౌద్ధారామాల్లో కార్తీక శోభ


