ద్వారకాతిరుమలలో వరుస చోరీలు
ద్వారకాతిరుమల: వరుస చోరీలతో ద్వారకాతిరుమల ప్రజలు ఒక్కసారిగా భీతిల్లారు. శనివారం అర్ధరాత్రి రెచ్చిపోయిన దొంగలు మూడు ఇళ్లల్లోకి చొరబడి 12 కాసుల బంగారం, రూ.2.50 లక్షల నగదు, ఒక పల్సర్ బైక్‌ను తస్కరించారు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని డీసీసీబీ బ్రాంచి సమీపంలోని ఓ ఇంట్లో పోలుబోయిన లక్ష్మణరావు ఉంటున్నాడు. రాత్రివేళ ఇంటి తలుపులు తెరచుకుని భార్యాభర్తలు ఓ గదిలో నిద్రిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి మరో గదిలో ఉన్న బీరువాను పగలగొట్టి 10 కాసుల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. దొంగలు వెండి వస్తువులను విడిచిపెట్టి కేవలం బంగారు వస్తువులను మాత్రమే దోచుకెళ్లారని, నిద్రిస్తున్న తమపై ఏదో స్ప్రే చేసినట్టు అనిపించిందని లక్ష్మణరావు భార్య కుమారి తెలిపారు. స్థానిక చెరువు వీదిలోని కనిగొళ్ల లక్ష్మీ కాశీ విశ్వనాథ్(కాశీ) ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువాలోని సుమారు 2 కాసుల బంగారు వస్తువులు, రూ.2.50 లక్షల నగదును చోరీ చేశారు. అశ్వారావుపేటలోని తన చెల్లి ఇంటికి ఒక శుభకార్యం నిమిత్తం శనివారం ఉదయం కుటుంబ సమేతంగా వెళ్లిన కాశీ, తిరిగి ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత ఈ చోరీని గుర్తించాడు. గ్రంథాలయం పక్క రోడ్డులోని ఒక ఇంట్లో పల్సర్ 220 బైక్‌ను చోరీ చేశారు. బాధితులు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్సై టి.సుధీర్ ఘటనా స్థలాలను పరిశీలించారు. చోరీలపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
అర్ధరాత్రి మూడు ఇళ్లలో దొంగతనాలు


