భక్తులకు మెరుగైన సేవలందించాలి
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. చినవెంకన్న క్షేత్రాన్ని ఆదివారం సందర్శించిన ఆమె, స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు, పండితుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి కలెక్టర్‌కు శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆమె ఆలయంలోని పలు విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులతో స్వయంగా మాట్లాడి ఆలయంలో అందుతున్న సౌకర్యాలు, దర్శనానికి పడుతున్న సమయం, ఆలయ సిబ్బంది ప్రవర్తన తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిత్యాన్నదాన సదనంలోని వంటశాలను పరిశీలించి, భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. క్యూ లైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా, త్వరితగతిన స్వామివారి దర్శనం జరిగేలా చూడాలన్నారు. భక్తులకు అందించే అన్న ప్రసాదం సరైన నాణ్యతతో ఉండేలా చూడాలని, వంటశాలలో పూర్తి పరిశుభ్రత ఉండేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. అనంతరం గో సంరక్షణ శాలను, బయో గ్యాస్ (గోబర్ గ్యాస్) ప్లాంట్ వినియోగాన్ని పరిశీలించి, సంప్రదాయేతర ఇంధన వనరులను సమర్ధవంతంగా వినియోగిస్తున్న ఆలయ అధికారులను అభినందించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రమణరాజు, సూపరింటిండెంట్ కోటగిరి కిషోర్ తదితరులున్నారు.
శ్రీవారి దేవస్థానం అధికారులను
ఆదేశించిన కలెక్టర్


