పోలవరం ప్యాకేజీపై దర్యాప్తు చేయాలి
కొయ్యలగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందజేస్తున్న ప్యాకేజీపై ప్రభుత్వం అత్యున్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. శనివారం రామానుజపురం గ్రామంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిర్వాసితులకు అందజేస్తున్న నష్టపరిహారం గురించి కూటమి పెద్దలే స్వయంగా అవినీతి జరుగుతోందంటూ ఆరోపణలు చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. నష్ట పరిహారాన్ని అందజేయడంలో దళారులు రాజ్యమేలుతుందని ఇటీవల డీసీఈబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు ఆరోపించడాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజాదరణను చూసి కూటమి ప్రభుత్వం వెన్నులో వణుకు ప్రారంభమైందన్నారు. పార్టీ మండల కన్వీనర్ తుమ్మలపల్లి గంగరాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి గొడ్డటి నాగేశ్వరరావు, ఎంపీపీ గంజిమాల రామారావు, పార్టీ నాయకులు పసుపులేటి వెంకటేశ్వరరావు, కోనే నాగసూరి, తోట జయబాబు, చిక్కాల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


