కన్నులపండువగా శ్రీవారికి ఏకాదశి ఉత్సవం
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో శనివారం రాత్రి శ్రీవారికి తిరువీధి సేవ అట్టహాసంగా జరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుక భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, సుగంధ భరిత పుష్పమాలికలతో విశేషంగా అలంకరించారు. అనంతరం అర్చకులు పూజాధికాలను జరిపి, హారతులిచ్చారు. ఆ తరువాత స్వామివారి వాహనం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. దీపావళి పండుగ తరువాత స్వామివారు తొలిసారిగా పురవీధులకు రావడంతో భక్తులు ప్రతి ఇంటి ముంగిటా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అలాగే స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు.
పోటెత్తిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో శనివారం భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు, ఏకాదశి, కార్తీకమాస పర్వదినాలను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దీంతో అన్నివిభాగాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి దర్శనానంతరం పెద్ద ఎత్తున భక్తులు ఆలయ తూర్పు రాజగోపురం వద్ద ఉన్న దీపారాధన మండప ప్రాంతంలో కార్తీక దీపాలను వెలిగించారు. వేలాది మంది భక్తులు శ్రీవారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. క్షేత్రంలో రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది.
కన్నులపండువగా శ్రీవారికి ఏకాదశి ఉత్సవం


