పాములు కరుస్తున్నా.. పట్టదా? | - | Sakshi
Sakshi News home page

పాములు కరుస్తున్నా.. పట్టదా?

Nov 1 2025 7:44 AM | Updated on Nov 1 2025 7:44 AM

పాముల

పాములు కరుస్తున్నా.. పట్టదా?

ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపై విష సర్పాల సంచారం అధికమైంది. దాంతో భక్తులతో పాటు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న దేవస్థానం సిబ్బంది సైతం భయాందోళనకు గురవుతున్నారు. ఏ సమయంలో ఎటు నుంచి పాములు వస్తాయోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఇక పాదయాత్ర భక్తులైతే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆలయానికి చేరుకుంటున్నారు. భక్తులు అధికంగా సంచరించే ప్రాంతాలపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు. ఫలితంగా పలు ప్రధాన మార్గాల్లో పొదలు, చెట్ల కొమ్మలు పెరిగిపోయాయి. అయినా వాటిని పట్టించుకునే నాధుడు లేడు. కనీసం భక్తులు ప్రమాదాల భారిన పడుతున్న మార్గాల వైపు కూడా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఇటీవల జరిగిన ఒక ఘటనే ఇందుకు దర్పణంగా నిలుస్తోంది. చాట్రాయి మండలం, చిన్నంపేట గ్రామానికి చెందిన అన్నపరెడ్డి భారతి, మరో పది మంది భక్తురాళ్లు పాదయాత్రగా ఈనెల 26న రాత్రి క్షేత్రానికి చేరుకున్నారు. ముందుగా వారు నిత్యాన్నదాన భవనంలో స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆ తరువాత శివాలయం–పాత కేశఖండనశాల మెట్లు మార్గం గుండా నడుచుకుంటూ ఆలయానికి వెళుతున్నారు. ఆ సమయంలో కట్లపాము భారతి చేతి వేలుపై కరిచింది. వెంటనే ఆలయ ప్రథమచికిత్సా కేంద్రం సిబ్బంది ఆమెను దేవస్థానం ఆంబులెన్స్‌లో స్థానిక పీహెచ్‌సీకి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీవారి దయవల్ల భారతికి ఏమీ కాలేదు.

జరిగి ఐదు రోజులైనా..

ఈ ప్రమాదం జరిగి ఐదు రోజులైనా శివాలయం–పాత కేశఖండనశాల మెట్లు మార్గంపై అధికారులు దృష్టి సారించలేదు. ఫలితంగా ఆ మార్గం ఇంకా పొదలు, చెట్ల కొమ్మలతోనే దర్శనమిస్తోంది. ప్రస్తుతం కొందరు భక్తులు ఆ మార్గంలోంచే రాకపోకలు సాగిస్తున్నారు. దాంతో భక్తులకు ఏదీ.. రక్షణ అని అధికారుల తీరుపై పలువురు ధ్వజమెత్తుతున్నారు.

సిబ్బంది క్వార్టర్స్‌లలోకి..

శ్రీవారి దేవస్థానం ఈఓ డ్రైవర్‌ శ్రీనివాస్‌ నివాసం ఉంటున్న క్వార్టర్స్‌లోకి ఇటీవల తాచుపాము ప్రవేశించి, పెంపుడు హచ్‌ కుక్కను కరవడంతో అది మృతి చెందింది. పది రోజుల క్రితం అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఫణి క్వార్టర్స్‌లోకి, తాజాగా గురువారం ఉదయం సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌ క్వార్టర్స్‌లోకి పాములు ప్రవేశించాయి. గోసంరక్షణశాలలోకి తరచూ పాములు వెళుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. చుట్టూ పొదలు పెరగడమే ఇందుకు కారణం. ఇప్పటికై నా అధికారులు స్పందించి పాముల నివారణకు చర్యలు చేపట్టాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.

శ్రీవారి భక్తులకు ఏదీ రక్షణ.!

శివాలయం పాత మెట్ల మార్గంలో..

ఇరు పక్కలా పెరిగిన పొదలు, చెట్ల కొమ్మలు

ఐదు రోజుల క్రితం పాదయాత్ర భక్తురాలిని కరిచిన కట్లపాము

ఆ మార్గాన్ని నేటికీ పట్టించుకోని అధికారులు

పాములు కరుస్తున్నా.. పట్టదా? 1
1/2

పాములు కరుస్తున్నా.. పట్టదా?

పాములు కరుస్తున్నా.. పట్టదా? 2
2/2

పాములు కరుస్తున్నా.. పట్టదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement