క్రీడలతో దేహదారుఢ్యం
చింతలవల్లి(ముసునూరు): క్రీడలతో దేహదారుఢ్యం, మానసిక ఉల్లాసంతో పాటు సమయ పాలన వంటి లక్షణాలు అలవడతాయని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. మండలంలోని చింతలవల్లి శివారు గోగులంపాడు–కొత్తూరులో గత వారం రోజులుగా జరిగిన 70 వ రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీల విజేతలకు సర్పంచ్ పి.సత్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం రాత్రి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గ్రామంలో గత 70 ఏళ్ళ నుంచి, చెడుగుడు పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రథమ, ద్వితీయ స్థానాలను విజయవాడ స్కై టీమ్, గోగులంపాడు శ్రీకృష్ణ టీమ్, జూనియర్స్ విభాగంలో గోగులంపాడు–1, గోగులంపాడు–2 టీంలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. విజయం సాధించిన జట్లను మాజీ ఎమ్మెల్యే అభినందించి సీనియర్లకు నగదు బహుమతులు అందించారు. జూనియర్లకు తాడిగడప శ్రీనివాస రావు, తొర్లపాటి శ్రీనివాసరావు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా వైస్ చైర్మన్ కృష్ణంరాజు, వైస్ ఎంపీపీ రాజానాయన, సొసైటీ మాజీ అధ్యక్షుడు సుగసాని శ్రీనివాసరావు, మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఎం.నాగవల్లేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు పల్లిపాము సూర్య, మాజీ ఉపసర్పంచ్ చాకిరి రామకృష్ణ, చింతా వీరభద్రరావు, తదితరులు పాల్గొన్నారు.


