రచయిత్రి సత్యవతికి సాహిత్య పురస్కారం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రముఖ కథా రచయిత్రి పీ సత్యవతికి 2025 సంవత్సరానికి శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం అందచేయనున్నట్టు గుప్తా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మడుపల్లి మోహన గుప్తా ప్రకటించారు. శుక్రవారం నగరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏటా తన జన్మదినం సందర్భంగా తన తండ్రి కృష్ణమూర్తి పేరిట ఏర్పాటు చేసిన సాహిత్య పురస్కారాన్ని ప్రకటిస్తున్నామని, ఈ ఏడాది ఎంపికై న సత్యవతికి పురస్కారంతోపాటు ప్రశంసా పత్రం, జ్ఞాపిక, రూ.3 లక్షల నగదు అందజేయనున్నట్లు తెలిపారు. 1989లో ప్రారంభించిన గుప్తా ఫౌండేషన్ ద్వారా ఏటా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని రెడ్‌క్రాస్ భవనం తలసేమియా బ్లాక్‌పై రెండో అంతస్తు నిర్మాణా నికి రూ.60 లక్షలు, రూరల్ మండలం శ్రీపర్రులో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి రూ.20 లక్షలు ఇస్తామని ప్రకటించారు. రూ.లక్ష రూపాయలు వ్యయంతో 15 మంది పోలియో వ్యాధిగ్రస్తులకు కృత్రిమ అవయవాలు, కాలిపర్స్ అందజేశారు. కార్యక్రమంలో ఆడిటర్ డీవీ సుబ్బారావు, అంబికా గ్రూప్ సంస్థల అధినేత అంబికా కృష్ణ, నగర ప్రముఖులు పాల్గొన్నారు.


