ఏజెన్సీలో భారీ వర్షం
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి సుమారు 4 గంటలకు పైగా భారీ వర్షం కురిసింది. పోలవరం నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో సుమారు 43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు చెప్పారు. బుట్టాయగూడెంలో 9 సెం.మీ, కొయ్యలగూడెంలో 7, జీలుగుమిల్లిలో 2, టి.నర్సాపురంలో 8, కుక్కునూరులో 4, వేలేరుపాడులో 4, పోలవరంలో 9 సెంటీమీటర్ల వర్షం కురిసంది. దీంతో కొండవాగులు పొంగిపొర్లాయి. కేఆర్‌పురం సమీపంలోని కొండవాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో వాగుకు ఇరువైపు లా రాకపోకలు మూడు గంటలపాటు నిలిచిపోయాయి. ఐటీడీఏ పీఓ రాములునాయక్, బుట్టాయగూడెం తహసీల్దార్ చలపతిరావు ప్రవాహం తగ్గే వరకూ ప్రజలెవ్వరూ వాగు దాటకుండా చర్యలు చేపట్టారు. నందాపురం సమీపంలోని అల్లికాల్వ, బైనేరు వాగుతోపాటు పలు వాగులు ఉధృతంగా ప్రవహించాయి.
కొయ్యలగూడెం: తుపాను ప్రభావంతో కురి సిన భారీ వర్షాలకు కాలువలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కన్నాపురంలో కాజ్‌వేపై నుంచి పడమటి కాలువ ప్రవహించడంతో కొయ్యలగూడెం–బుట్టాయగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే రాజ వరం వద్ద బైనేరు, పులివాగు కాలువలు కలవడంతో ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తూ వంతెనను తాకుతూ పరవళ్లు తొక్కింది. కొయ్యలగూడెం మండలంలో మంగపతిదేవిపాలెం, జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామాల మధ్య ఉన్న సప్టాపై ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహించడంతో ఇటుగా రాకపోకలకు ఆటంకం కలిగింది. ఏజెన్సీ కొండ ప్రాంతాల నుంచి వర్షం నీరు ముంచెత్తుతోంది. పొక్లయిన్‌తో తూర్పుకాలువ వద్ద అడ్డుగా ఉన్న తూడును తొలగించారు.


