కేంద్ర ఆర్థిక విధానాలపై రాజీలేని పోరు
ఏలూరు (టూటౌన్): ఎల్‌ఐసీలో ఉన్న వేల కోట్ల రూపాయల ప్రజల ఆస్తిని ఏజెంట్ల కష్టాన్ని అదానీకి అప్పనంగా అప్పచెబుతున్న కేంద్ర ప్రభుత్వ దివాలాకోరు ఆర్థిక విధానాలపై రాజీ లేని పోరాటం కొనసాగించాలని టీచర్స్ ఎమ్మెల్సీ బి.గోపి మూర్తి పిలుపునిచ్చారు. స్థానిక సీతారామ భర్తీయా కళ్యాణ మండపంలో ఎల్‌ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆరో రాష్ట్ర మహాసభ ఆదివారం ఘనంగా జరిగింది. ఎల్‌ఐసీ ఏఓఐ రాష్ట్ర అధ్యక్షుడు టీ కోటేశ్వరరావు సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ గోపి మూర్తి మాట్లాడుతూ నరేంద్ర మోదీ స్నేహితుడు అదాని కోసం ఎల్‌ఐసిని బలి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. ఏఐఈఈఏ సౌత్ సెంట్రల్ జోన్ అధ్యక్షుడు పి.సతీష్ మాట్లాడుతూ ప్రభుత్వ బీమా కంపెనీలపై నమ్మకం కోల్పోయేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు ఆల్ ఇండియా ఎల్‌ఐసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.మంజునాథ్ తదితరులు మాట్లాడారు.


