పాము కాటుకు గురైన భక్తురాలు
అందుబాటులో లేని 108 ఆంబులెన్స్‌లు
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపై ఆదివారం రాత్రి ఓ పాదయాత్ర భక్తురాలు పాము కాటుకు గురైంది. 108 ఆంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో ఆలయ ప్రథమ చికిత్స సిబ్బంది ఆమెను దేవస్థానం ఆబులెన్స్‌లో హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. చాట్రాయి మండలం, చిన్నంపేట గ్రామానికి చెందిన అన్నపరెడ్డి భారతి, మరో పది మంది భక్తులు పాదయాత్రగా రాత్రి కొండపైకి చేరుకున్నారు. ఆలయానికి చేరుకునే క్రమంలో పాత కేశఖండనశాల వద్ద నుంచి శివాలయానికి వెళ్లే మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. ఇంతలో భారతి మెట్లపై కూర్చుని, తన కుడి చేతిని పక్కనే ఉన్న రాతి గోడపై పెట్టింది. అక్కడున్న కట్లపాము కరిచింది. భారతిని ఆస్పత్రికి తరలించేందుకు దేవస్థానం ప్రథమ చికిత్సా కేంద్రం సిబ్బంది 108కు ఫోన్ చేయగా, బిజీగా ఉన్నాయని చెప్పి ఫోన్ కట్ చేశారు. దాంతో భారతిని దేవస్థానం అంబులెన్స్‌లో తొలుత స్థానిక పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అదే అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ద్వారకాతిరుమల 108 ఆంబులెన్స్ 5 రోజుల క్రితం, కామవరపుకోట ఆంబులెన్స్ నెల క్రితం, భీమడోలు ఆంబులెన్స్ వారం క్రితం, అలాగే జంగారెడ్డిగూడెం ఆంబులెన్స్ సైతం మరమ్మతుల నిమిత్తం షెడ్డుకు చేరాయి. దాంతో ఈ మండలాల ప్రజలకు 108 సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


