ఏలూరు జిల్లా డీఎస్‌డీఓగా అజీజ్ బాధ్యతలు
ఏలూరు రూరల్: ఏలూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్‌డీఓ) అధికారిగా సయిద్ అబ్దుల్ అజీజ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్విని కలిశారు. గతంలోనూ ఆయన ఏలూరు జిల్లా డీఎస్‌డీఓగా పనిచేశారు. ఇప్పటి వరకూ డీఎస్‌డీఓగా పనిచేసిన బి శ్రీనివాసరావు విజయవాడకు బదిలీ అయ్యారు. కాగా పశ్చిమగోదావరి జిల్లా డీఎస్‌డీఓగా నియమితులైన అధికారి బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఆయన స్థానంలో అజీజ్ ఇన్‌చార్జి డీఎస్‌డీఓగా వ్యవహరించనున్నారు.
శ్రీవారి క్షేత్రంలో కార్తీక సందడి
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో కార్తీకమాసం సందడి మొదలైంది. తొలిరోజు బుధవారం చినవెంకన్న ఆలయానికి విచ్చేసిన భక్తుల్లో అధిక శాతం మంది, స్వామివారి దీపారాధన మండప ప్రాంతంలోని చెట్టు వద్ద కార్తీక దీపాలను భక్తి శ్రద్ధలతో వెలిగించారు. అలాగే క్షేత్రపాలకుని ఆలయంలో అర్చకులు శివదేవునికి విశేష అభిషేకాలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
ముదినేపల్లి రూరల్: స్థానిక మసీదు రోడ్డులో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో రేకులషెడ్డు పూర్తిగా దగ్ధమైంది. స్థానిక హోటల్లో పనిచేస్తున్న మట్టి నరసమ్మ ఇంట్లో లేని సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో గృహోపకరణాలు, బీరువాలో దాచుకున్న కొంతమేర నగదు కాలిపోయినట్లు బాధితురాలు నరసమ్మ తెలిపింది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సర్వం కోల్పోయిన బాధితురాలు నరసమ్మకు స్థానిక ప్రముఖ వైద్యుడు అంబుల మనోజ్ రూ.5 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
బాలికల కుస్తీలో
‘పశ్చిమ’కు మూడో స్థానం
విజయవాడరూరల్: ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఏపీఎస్‌జీఎఫ్), సమగ్ర శిక్ష(ఎస్‌ఎస్), ఎన్టీఆర్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అశోక్ ఫంక్షన్‌హాలులో 69వ స్కూల్ గేమ్స్ అండర్–19 అంతర్ జిల్లాల కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. నున్న గ్రామంలో బుధవారం జరిగిన బాలికల కుస్తీ పోటీల్లో పశ్చిమ గోదావరి జట్టు మూడోస్థానంలో నిలిచింది. బాలురు, బాలికల విభాగాల్లో నిర్వహిస్తున్న ఈ పోటీలకు 350 మంది క్రీడాకారులు, కోచ్‌లు మేనేజర్లు హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
ఏలూరు జిల్లా డీఎస్‌డీఓగా అజీజ్ బాధ్యతలు


