పారిశుద్ధ్య సిబ్బంది జీతాల బకాయిలపై వినతి
ఏలూరు టౌన్: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి జీతాల బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కమిషనర్ చక్రధర్‌బాబుకు బుధవారం ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కే.కృష్ణమాచార్యులు, జిల్లా కార్యదర్శి వి.దత్తాత్రేయ (దత్తు) వినతిపత్రం అందజేశారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్ కాంట్రాక్ట్ పనులు చేపట్టిన ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ శానిటేషన్ వర్కర్లకు జీతాలు చెల్లించలేదనీ, భారీగా బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. ప్రస్తుతం ఫస్ట్ అబ్జెక్ట్ ప్రైవేటు లిమిటెడ్, ఫస్ట్ అబ్జెక్ట్ ఏజెన్సీ అని వేర్వేరుగా అగ్రిమెంట్లు చేసుకున్న కాంట్రాక్ట్ సంస్థలు తమ పారిశుద్ధ్య కార్మికులను దారుణంగా మోసం చేశాయని ఆరోపించారు. కార్మికులకు న్యాయం చేయకుంటే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. సిబ్బందికి జీతాలు చెల్లించని పక్షంలో వాటిని బ్లాక్ లిస్ట్‌లో పెడతామని హెల్త్ కమిషనర్ హామీ ఇచ్చారని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఏలూరు బ్రాంచ్ అధ్యక్షురాలు పీ.విజయ, సూపర్‌వైజర్ అజయ్ తదితరులు ఉన్నారు.


