బకాయిల విడుదలలో నిర్లక్ష్యంపై ఫిర్యాదు
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాకు సంబంధించి 2015 నుంచి రేషన్ డీలర్లకు రావలసిన కమిషన్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినా సంబంధిత ఫైలు జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ కార్యాలయంలో పెండింగ్‌లోనే ఉందని జిల్లా రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు అత్తులూరి ఉదయ్ ఈశ్వరరావు ఆధ్వర్యంలో జేసీ అభిషేక్ గౌడ్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఉదయేశ్వరరావు మాట్లాడుతూ ఫైల్ డీఎం కార్యాలయానికి ఎప్పుడో పంపారని.. అక్కడ అప్రూవల్ చేసి కమిషనర్ కార్యాలయానికి పంపించాలని.. సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు, కోశాధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


