రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఏలూరు టౌన్: ఏలూరు శివారు వట్లూరు ప్రాంతంలో రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఏలూరు రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఓ వ్యక్తి వట్లూరు ప్రాంతంలో రైలుపట్టాలు దాటుతూ ఉండగా తిరుపతి నుంచి కాకినాడ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదవశాత్తు ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి వయసు సుమారు 40 ఏళ్లు పైన ఉంటాయని, వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని రైల్వే హెచ్‌సీ శ్రీనివాస్ తెలిపారు. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచామని చెప్పారు.
నరసాపురం: పట్టణంలోని ఒకటో వార్డు శ్రీహరిపేటలో ఓ తండ్రి తన కన్నకూతురిపై ఘాతుకానికి ఒడిగట్టాడు. కుమార్తైపె అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పపట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. రిమాండ్ విధించారు. తల్లి ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉంటుండగా ఇద్దరు మైనర్ కుమార్తెలతో శ్రీహరిపేటలో నివాసం ఉంటున్న తండ్రి కామంతో నిర్దయగా ప్రవర్తించాడు. 13 ఏళ్ల కుమార్తైపె పలు దఫాలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం వారి బంధువుకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.
నూజివీడు: పట్టణంలోని అజరయ్యపేటకు చెందిన తాళ్లూరి నాగరాజు(56) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సోమవారం వెలుగుచూసింది. వివరాల ప్రకారం మైలవరం రోడ్డులోని కొడిమెల కొండయ్య సత్రంకు చెందిన బావిలో నాగరాజు శవమై తేలుతుండగా సోమవారం ఉదయం సమీపంలోని వారు చూసి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. వారు బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసిన తరువాత నాగరాజుగా గుర్తించారు. పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే నాగరాజు కొంతకాలంగా కొండయ్య సత్రంలో గది అద్దెకు తీసుకొని నివాసముంటున్నాడు. మద్యం మత్తులో బావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడా లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ పీ సత్యశ్రీనివాస్ తెలిపారు.
నూజివీడు: పట్టణంలోని ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన కళాశాల బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కందకంలోకి దూసుకెళ్లింది. మండలంలోని బోర్వంచ సమీపంలోని హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ వద్ద 40 మంది విద్యార్థులతో మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వస్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి వెళ్లి ఆగింది. ఈ ప్రమాదంలో విద్యార్థులందరూ క్షేమంగా బయటపడటంతో కళాశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి


