శ్రీవారికి దీపావళి ఉత్సవం
ద్వారకాతిరుమల: బాణ సంచా వెలుగుల నడుమ ఉభయ దేవేరులతో శ్రీవారికి కోవెల ఉత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ప్రతి ఏటా క్షేత్రంలో దీపావళి ఉత్సవాన్ని ఘనంగా జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోనే పండుగ తిథిలో తగులు, మిగులు రావడంతో శ్రీవారి దేవస్థానం అధికారులు దీపావళిని మంగళవారం రాత్రి నేత్రపర్వంగా జరిపారు. క్షేత్ర పురవీదుల్లో అంగరంగ వైభవంగా జరగాల్సిన ఈ ఉత్సవం, ఆకాశం మేఘావృతం కావడంతో ఆలయానికే పరిమితమైంది. ముందుగా దేవస్థానం సిబ్బంది ఆలయాన్ని దీపాలతో విశేషంగా అలంకరించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లను తోళక్క వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేసి, హారతులిచ్చారు. అనంతరం శ్రీవారి వాహనాన్ని కోవెల చుట్టూ మూడుసార్లు తిప్పారు. దేవస్థానం సిబ్బంది స్వామివారి వాహనం ముందు, అలాగే ఆలయ ప్రధాన రాజగోపురం మెట్లపై పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ఇదిలా ఉంటే స్వామివారి రాక కోసం.. వేయి కళ్లతో ఎదురు చూసిన గ్రామ ప్రజలు, గ్రామోత్సవం రద్దవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
పెదపాడు: స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నల్లపరాజు సత్యనారాయణరాజు (40) ఈ నెల 17 నుంచి కనిపించడం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యనారాయణరాజు కాళ్ల మండలంలోని కలవపూడి గ్రామస్తుడు నల్లపరాజు రామరాజు కుమారుడు. పదేళ్లుగా పెదపాడులో ఉంటూ నాయుడుగూడెం, వీరమ్మకుంట గ్రామాల్లో చేపల చెరువులు సాగు చేస్తున్నాడు. దీంతో పాటు రైతుల నుంచి రొయ్యలు కొనుగోలు చేసి కంపెనీలకు విక్రయిస్తుంటాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ నెల 19న అతడి బైక్‌లో కుటుంబ సభ్యులకు ఓ ఉత్తరం కనిపించగా.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నానని ఉత్తరంలో రాసినట్లు సమాచారం. మరోపక్క సత్యనారాయణరాజు అదృశ్యం కావడంతో కోట్లాది రూపాయల నగదు తమకు రావాల్సి ఉందని, తమ పరిస్థితి ఏమిటని రైతులు లబోదిబోమంటున్నారు.


