
బ్రాందీ షాపులను తొలగించాలంటూ ధర్నా
నూజివీడు: మండలంలోని అన్నవరంలో నివాస గృహాలకు దగ్గరగా, పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న బ్రాందీ షాపులను వెంటనే అక్కడి నుంచి తొలగించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహా డిమాండ్ చేశారు. రెండు షాపులను అక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని ఎకై ్సజ్ స్టేషన్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నవరంలో ఉన్న బ్రాందీ షాప్ వల్ల ఆకతాయిలు చేస్తున్న చేష్టలతో మహిళలు, విద్యార్థినులు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారన్నారు. అలాగే పట్టణ నడిబొడ్డున మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మద్యం వ్యాపారం చేస్తూ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగజేస్తున్నా ప్రభుత్వ అధికారులకు గానీ, ప్రజాప్రతినిధులకు గాని చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నివాస గృహాల మధ్య, మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న మద్యం షాపులను తొలగించాలన్నారు. నాయకులు మడుపల్లి నాగేంద్రరావు, చెంగల వెంకటేశ్వరావు, ఆకునూరి విఘ్నేష్, బాధిత మహిళలు పాల్గొన్నారు.