
యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు
చింతలపూడి: మేలైన యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాఽధించవచ్చునని చింతలపూడి వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ సంచాలకులు వై సుబ్బారావు అన్నారు. ఎంటీయూ 1064 రకం 10,032 ఎకరాలు, ఎంటీయూ 1061 రకం, ఎంటీయూ 1318 రకం , పీఎల్ 1100 రకం , బీపీటీ 5,204 రకాలను రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వరి పిలక దశలో ఉంది.
వెదజల్లే పద్ధతిలో ఖర్చు తక్కువ
డివిజన్ పరిధిలో వెదజల్లే పద్ధతిలో కూడా రైతులు వరిసాగు చేస్తున్నారు. మెట్టలో ఎక్కువగా నారుడులు, నాట్లు పద్ధతిలోనే సాగవుతుంది. వెదజల్లే పద్ధతిలో ఖర్చు తగ్గుతుంది. నేరుగా వెదజల్లడం వల్ల కలుపు బెడద ఉంటుంది. గడ్డి, కలుపు నిర్మూలనకు ప్రిటెలక్లోర్, సిఫినర్ ఎకరాకు 600 మి.లీ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి విత్తనాలు వెదజల్లిన 3వ రోజులోపు పిచికారీ చేయాలి లేదా బ్యూటక్లోర్ ఎకరానికి 1.2 లీటర్ల ద్రావణాన్ని 20 కేజీల పొడి ఇసుకతో కలిపి పొలమంతా సమానంగా పడేట్లు విత్తిన 3వ రోజు లోపు చల్లాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల లోపు వెడల్పాకు కలుపు సమస్య ఉంటే 3డి సోడియం సాల్డ్ పొడి మందును ఎకరాకు 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి
సాధారణ పద్ధతిలో సస్యరక్షణ
నాట్లు పూర్తయిన పొలానికి చిరు పొట్టదశలో వేయాల్సిన ఎరువులో నత్రజనితో పాటు మ్యూరెట్ ఆఫ్ పొటాష్‌ని ఎకరానికి 150 నుంచి 200 కిలోల చొప్పున తప్పక వేయాలి. ఆలస్యంగా నాట్లు వేసిన, నీళ్లు నిల్వ ఉండే పల్లపు భూముల్లో జింకు ధాతు లోపం రావడానికి అవకాశం ఉంది. పంటపై జింక్ ధాతు లోపం కనిపించినప్పుడు రెండు దఫాలుగా వారం వ్యవధిలో 2 గ్రాముల జింక్ సల్ఫేట్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వరిసాగు చేస్తున్న రైతులు నీటి వినియోగం మీద అవగాహన పెంచుకోవాలి. అనవసరంగా ఎక్కువగా నీటిని వాడటం ద్వారా ఎరువుల వినియోగ సామర్ధ్యం తగ్గడమే కాకుండా, నీరు కూడా వృథా అవుతోంది. పిలక దశలో ఒక అంగుళం, చిరుపొట్టదశలో రెండు అంగుళాల నీటిని వినియోగించుకుని మెరుగైన దిగుబడులు సాధించాలి. సార్వాలో ముందుగా ఊడ్చిన పొలాల్లో కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగు ఆశించే అశకాశం ఉంది. వీటి నివారణకు లీటరు నీటికి కార్టాప్ హైడ్రాక్లోరైడ్ 2 గ్రాములు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 0.3 మి.లీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. చిరుపొట్ట దశలో ఎకరానికి కార్టాఫ్ హైట్రాక్లోరైడ్ 4జి గుళికలు 8 కిలోలు లేదా కార్బోప్యూరాన్ 3జి గుళికలు 10 కిలోలు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 0.4జి గుళికలు 4 కిలోలు వేసుకోవాలి. వరిలో ప్రొఫెనోపాస్‌ను నల్లి నివారణకు కొంత మంది రైతులు పిచికారీ చేస్తున్నారని, వరిలో ప్రొఫెనోపాస్ వాడటం వల్ల దోమపోటు అధికం అవుతుంది. అందువల్ల ప్రొఫెనోపాస్ బదులు ఎసిఫైట్ వాడాలి.
వై సుబ్బారావు, సబ్ డివిజన్ సహాయ సంచాలకులు

యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు