
మడకంవారిగూడెంలో ఉద్రిక్తత
● నేవీ ఆయుధ డిపోను వ్యతిరేకిస్తూ ర్యాలీకి సన్నాహాలు
● నిరసనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం మడకంవారిగూడెంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వంకవారిగూడెంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటును నిరసిస్తూ నేవీ ఆయుధ డిపో వ్యతిరేక పోరాట వేదిక ఆధ్వర్యంలో ఆ సంఘ నాయకులు, గిరిజనులు భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేశారు. జీలుగుమిల్లి సర్కిల్ పరిధిలోని 3 మండలాల్లో ఎలాంటి ర్యాలీలు, సభలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో మడకంవారిగూడెం నుంచి వంకవారిగూడెం మీదుగా జీలుగుమిల్లి వరకూ భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. గిరిజన గ్రామాల్లో ఈ ర్యాలీకి అనుమతులు లేవంటూ పోలీసులు నిరసన కారులను అడ్డుకున్నారు. ఆ సమయంలో సీఐ వెంకటేశ్వరరావు, ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ర్యాలీ నిర్వహించకుండా గ్రామాల్లో భారీ గేట్లను ఏర్పాటు చేశారు. ర్యాలీ చేసేందుకు ఐక్యపోరాట వేదిక నాయకులు, గిరిజనులు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య కొద్దిసేపు గొడవ జరిగింది. ఆందోళనకారులు చొచ్చుకుపోయే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. డిపో ఏర్పాటును తిరస్కరిస్తూ ఇప్పటికే మూడుసార్లు తీర్మానం చేశామని అయినప్పటికీ డిపో ఏర్పాటుకు సన్నాహాలు చేయడం బాధాకరమని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రవి అన్నారు. దాట్లవారిగూడెంలో నేవీ ఆయుధ డిపోను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పోరాట ఐక్యవేదిక నాయకులు తెల్లం రామకృష్ణ, తగరం బాబూరావు, తెల్లం దుర్గారావు, ఈ.భూషణం, బన్నే వినోద్, పాల్గొన్నారు.