
డీజేలతో గుండె గుబేల్ !
ఇవీ మార్గదర్శకాలు
యలమంచిలి: పండుగలు, పెళ్లిళ్లు, ఉత్సవాలు శుభకార్యం ఎలాంటిదైనా సరే డీజే శబ్దాలు ఉండాల్సిందే. డీజే సంగీతానికి దాని దగ్గర ఉండి ఉత్సాహంగా నృత్యం చేసే వారికి ఆనందంగా ఉంటుందేమో గానీ కొందరికి అదే ప్రాణ సంకటంగా మారుతోంది. పలు ప్రాంతాల్లో డీజేల వద్ద నృత్యం చేస్తూ గుండె ఆగి చనిపోయారన్న వార్తలు ఇటీవల తరచూ చూస్తున్నాం. అంతేగాక దీని వల్ల శబ్ద కాలుష్యం పెరగడంతో పాటు చెవిటి, గుండె సమస్యలు, మానసిక సమస్యలు కూడా వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినా వీటి నియంత్రణకు అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా డీజే సౌండ్ బాక్స్ వినియోగం బాగా పెరిగింది. వివాహం అనంతరం ఇంటికి నూతన దంపతులను తీసుకొచ్చే తరుణంలో చేసే ఊరేగింపు (మెర్వణి), రాజకీయ నాయకులకు స్వాగతం పలికేందుకు చేసే ఊరేగింపు, ఏదైనా పోటీలో గెలిచినప్పుడు చేసే ఊరేగింపు ఇలా ఒక్కటేమిటి ఆనందం వచ్చినప్పుడు చేసుకునే ఎలాంటి ఊరేగింపునకై నా డీజే బాక్స్‌తో సంబంరం ఉండాల్సిందే. ఈ సందర్భంగా డీజే సౌండ్ బాక్సులు చేసే శబ్దాలకు యువత ఉత్సాహపు నృత్యాలతో ఆ ప్రాంతం మార్మోగిపోవాల్సిందే. దీని వల్ల అధిక శబ్ద కాలుష్యం వెలువడుతున్నా, హృద్రోగులు, సున్నిత మనస్సు గలవారు, పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నా ఎవ్వరికీ పట్టింపు ఉండదు. వారి ఆనందం వారిదేనన్న విధంగా పరిస్థితులు మారిపోయాయి. విపరీతమైన శబ్దాలతో ఊరేగే డీజే బాక్సులు ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
అధిక శబ్ధాలు ఆరోగ్యానికి చేటు!
మనం రోడ్డుపై వెళుతుంటే పెద్దగా శబ్దాలు చేస్తూ వాహనాలు వెళ్తుంటేనే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది గంటల తరబడి రోడ్లపై డీజే శబ్దాలతో ఊరేగింపు సాగితే ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కొందరు అర్ధరాత్రి వరకు డీజే శబ్దాలతో చేసే ఊరేగింపుతో ఎంతో మంది తీవ్ర అనారోగ్యానికి గురవున్నారు. డీజే శబ్దాలతో గుండె సమస్యలు, మానసిక సమస్యలు, వినికిడి లోపాలు, చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యానికి ఇబ్బంది ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాహనాలకు సౌండ్ హారన్లను నియంత్రిస్తున్న అధికారులు డీజేలను ఎందుకు నియంత్రించలేకపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బహిరంగ ప్రదేశాల్లో 10 డెసిబుల్స్‌కు మించి శబ్దం చేయరాదు.
ప్రైవేటు ప్రదేశాల (ఇల్లు, హాళ్లు)లో డీజే శబ్దాలు చేయరాదు.
లిఖిత పూర్వక అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు, సౌండ్ బాక్సులు వాడకూడదు.
నిషిద్ధ ప్రాంతాలుగా గుర్తించిన ప్రదేశాల్లో సంగీత ధ్వనులు, డ్రమ్స్ కొట్టడం, ఇతర శబ్దాలు చేయకూడదు.
సినిమా థియేటర్లలో సైతం 65 డెసిబుల్స్‌కు మించి శబ్దం రాకూడదు.
వైద్యశాలలు, విద్యా సంస్థలు, దేవాలయాలు, న్యాయ స్థానాలకు వంద మీటర్ల పరిధిలోని ప్రాంతాలను నిషిద్ధ ప్రాంతాలుగా పరిగణిస్తారు. ఇక్కడ శబ్దాలు చేయడంపై నిషేధం విధించారు.
పెరిగిన డీజేల వాడకం
అధిక శబ్దాలతో కాలుష్య కాటు
గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు, గుండె వ్యాధుల వారికి ప్రమాదం
పట్టించుకోని అధికారులు