
అద్దాల మండప నిర్మాణానికిరూ.కోటి విరాళం
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో అద్దాల మండప నిర్మాణానికి ఒక భక్తుడు రూ.కోటి విరాళం అందించారు. అనకాపల్లికి చెందిన బొండాడ కొండలరావు ముందుగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విరాళం చెక్కును ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తికి అందించారు. ఈ సందర్భంగా దాతకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, ప్రసాదాలను అందించడంతోపాటు ప్రత్యేకంగా అభినందించారు.
నిత్యాన్నదాన పథకానికి విరాళం
ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి ఒక భక్తుడు సోమవారం రూ.10,01,116 విరాళంగా అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన తాడికొండ శేషగిరిరావు ముందుగా సతీసమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఈ విరాళం చెక్కును ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తికి అందజేయగా, ఆయన దాతను సత్కరించి, అభినందించారు. దాత వెంట గ్రామానికి చెందిన పుసులూరి శ్రీధర్ తదితరులున్నారు.
ఏలూరు (మెట్రో): వాహనమిత్ర పథకం అర్హుడైన ప్రతి లబ్ధిదారుడికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఎంపీడీఓలను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి సోమవారం వాహనమిత్ర పథకం కింద అందిన దరఖాస్తులపై జిల్లా పరిషత్ సీఈఓ, ఎంపీడీఓలతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వాహనమిత్ర పథకం కింద అందిన దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం వెంటనే పూర్తిచేయాలన్నారు. జిల్లాలో వాహనమిత్ర పథకానికి 11,770 దరఖాస్తులు అందాయని, వాటిలో 7,581 దరఖాస్తులు ఈ–కేవైసీ పూర్తి అయ్యాయని, మిగిలిన దరఖాస్తుదారుల ఈ–కేవైసీ పనులు వెంటనే పూర్తిచేసి, అర్హులైన దరఖాస్తుదారుల పరిశీలన వెంటనే పూర్తి చేయాలనీ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
భీమవరం: ఆట్యా–పాట్యా సీనియర్స్ జిల్లా స్థాయి సెలక్షన్స్ ఈనెల 23వ తేదీన భీమవరం శ్రీచింతలపాటి బాపిరాజు స్మారకోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మంతెన రామచంద్రరాజు, జి.కిరణ్ వర్మ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎంపిక పోటీలు జరుగుతాయ న్నారు. ఎంపికై న జట్లు ఈనెల 25, 26 తేదీల్లో పల్నాడు జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు సెలక్షన్స్‌కు హాజరుకావాలని కోరారు.

అద్దాల మండప నిర్మాణానికిరూ.కోటి విరాళం