
నా జీవితం తెరిచిన పుస్తకం
బుట్టాయగూడెం: ఇద్దరు కూటమి నాయకులు మాట్లాడుకున్న ఆడియో సంభాషణకు తనకు సంబంధం ఏంటని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రశ్నించారు. పోల వరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏడాదిలో రూ. 100 కోట్లు సంపాదించారని టీడీపీ, జనసేనకు చెందిన అగ్ర నాయకులు మాట్లాడుకుంటే వారిని ప్రశ్నించకుండా చిర్రి బాలరాజు తనపై బురద చల్లాలని చూడటం ఎంతవరకూ సమజసమని ప్రశ్నించారు. 20 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన తనను ఎంత సంపాదించానో బయటకు తీస్తానని చిర్రి బాలరాజు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని తెల్లం బాలరాజు స్పష్టం చేశారు. తన తండ్రి తెల్లం చిన్నవడ్డీ వార్డు మెంబర్‌గా, సర్పంచ్‌గా జెడ్పీటీసీగా, ఎంపీపీగా అనేక పదువులు చెయ్యడమే కాకుండా పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారని అన్నారు. తనది రాజకీయ కుటుంబమని చెప్పారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తనను ఉపఎన్నికల్లో కూడా అత్యధిక మెజారిటీతో ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. చిర్రి బాలరాజు నిక్కర్లు వేసుకునే రోజుల్లో తాను ఎమ్మెల్యేగా ప్రజాసేవలో ఉన్నానని తెల్లం బాలరాజు తెలిపారు. తనమీద వచ్చిన ఆరోపణను పక్కదోవ పట్టించేందుకే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తనకు మద్యం షాపులు లేవని, ఇసుక, మట్టిలో కమిషన్ తీసుకోలేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో చిర్రి బాలరాజు జనసేన తరపున టికెట్టు తెచ్చుకుని పోటీకి రావాలన్నారు. తాను కూడా వైఎస్సార్‌సీపీ తరపున టికెట్టు తెచ్చుకొని నిలబడతానని ఎవరు ఎటువంటి వారో ప్రజలే తగిన తీర్పు ఇస్తారని చెప్పారు.
కూటమి నేతలను నిలదీయలేకే బురదజల్లే ప్రయత్నం
చిర్రి బాలరాజుపై మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఫైర్