
స్మార్ట్ మీటర్లపై ఉద్యమం తీవ్రతరం
జిల్లా వ్యాప్తంగా కదం తొక్కిన ప్రజా సంఘాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రజలపై కరెంటు బాదుడు ఉండదని, స్మార్ట్ మీటర్లను బిగిస్తే పగలగొట్టమని నాడు పిలుపునిచ్చిన నారా లోకేష్ ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఎందుకు బిగిస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నించారు. మంగళవారం స్థానిక విద్యుత్ భవన్ వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించవద్దని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రజా సంఘాల ఐక్య కార్యచరణ వేదిక నాయకులు బద్దా వెంకట్రావు, మన్నవ చైతన్య, ఏ రవి మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల బిగింపు విషయంలో గత ప్రభుత్వాన్ని విమర్శించిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా అదానీ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకోలేదని నిలదీశారు. స్మార్ట్ మీటర్ల బిగింపుపై ప్రజలు ఆగ్రహిస్తూ రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. స్మార్ట్ మీటర్లు బిగించే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ప్రజా సంఘాల నాయకులు యు.వెంకటేశ్వరరావు, బండి వెంకటేశ్వరరావు, ఉప్పులూరి హేమ శంకర్, పంపన రవికుమార్, యర్రా శ్రీనివాస్‌రావు, డీఎన్‌వీడీ ప్రసాద్, గడసాల రమణ, మీసాల రమణ, బీ.సోమయ్య, కే.శ్రీను, సంధకం అప్పారావు, కాకర్ల శ్రీను, నౌడు నెహ్రూ బాబు, రెడ్డి శ్రీనివాస డాంగే తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లోనూ ప్రజా వేదిక ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు.