
ముఖం చాటేసిన పులస
పెనుగొండ: గోదావరి జిల్లాలకు సంక్రాంతి పండుగ ఎంత ప్రత్యేకమో.. వరదనీటితో ఎగురుకొంటూ వచ్చే అతిథి పులస అంతే విశిష్టతను కలిగి ఉంటుంది. ఎర్రనీరు వచ్చిందంటే చాలు సముద్రం నుంచి ఎగురుకొంటూ గోదావరిలో కలసి నామాంతరం మార్చుకొని పులసగా పిలువబడే చేపలరాజు ఈ ఏడాది చిక్కడం కష్ట సాధ్యంగా మారింది. ప్రతి ఏటా జూన్ నుంచి సెప్టెంబరు వరకూ ఇబ్బడి ముబ్బడిగా దొరికి, దీపావళి వరకూ అరకొరగా దొరికే పులస ప్రస్తుతం దొరకడం కష్టంగా మారింది. దీంతో ఆశలు వదులుకొన్న జాలర్లకు, పులస ప్రియులకు గోదావరికి రెండు మూడు పర్యాయాలు వరద నీరు రావడంతో ఆశతో ఎదురు చూస్తున్నారు.
హిల్సా పులసగా నామాంతరం
సముద్రంలో హిల్సాగా పిలవబడే చేపజాతి పసిపిక్ మహాసముద్రంలో జీవిస్తుంటుంది. ప్రతి ఏటా గోదావరికి ఎర్రనీరు వచ్చే సమయానికి ఖండాంతరాలు ఈదుకొంటూ గోదావరికి వచ్చి సంతతిని వృద్ధి చేసుకొని తిరిగి సముద్రంలోకి వెళుతుంటాయి. ఈ సమయంలో జాలర్లకు చిక్కి కాసులు కురిపిస్తాయి. పులసలు వచ్చే సమయానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి జాతీయ రహదారిలో గోదావరి జిల్లాల మీదుగా ప్రయాణించే ప్రతి ఒక్కరూ పులస రుచిని చూడడానికి మక్కువ చూపుతుంటారు. దీంతో దీని ధర ఘనంగానే ఉంటుంది. పులస విరివిగా దొరికే ప్రతి ఏటా కిలో రూ.1500 నుంచి రూ.3 వేల వరకూ పలుకుతుంది. సైజు పెరిగే కొద్దీ ఒక్కో పులసను పోటీ పడి పులస ప్రియలు రూ.25 వేలుకు కొనుగోలు చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే, ఈ ఏడాది వీటి జాడే కరువైంది. దీంతో కిలో రూ.3 వేలు నుంచి అమ్మకాలు సాగిస్తున్నారు.
సముద్రపు పోటే కారణమా?
పులసల జాడ తగ్గడానికి సముద్రపు పోటు ఓ కారణంగా చెబుతున్నారు. గోదావరి జలాలు సముద్రంలోకి కలిసేటప్పుడు ఉండే తీయదనం, ఎర్రదనం తగ్గడంతో పులసల జాడ తక్కువైందని భావిస్తున్నారు. ఉప్పు జలాలు ప్రస్తుతం ఇటు సిద్ధాంతం వరకూ, అటు జొన్నాడ ఆలమూరు వరకూ ప్రభావం చూపుతుండడంతో పులస మార్గానికి ఆటంకం కారణం కావచ్చునని భావిస్తున్నారు. ఇసుక తవ్వకాలు భారీగా ఉండడంతో సముద్రపు జలాలు గోదావరిలోకి నానాటికీ బాగా చొచ్చుకు వచ్చి గోదావరి ప్రవాహ ప్రాంతం కలుషితమైందని అంటున్నారు. దీంతో పులస మార్గానికి ఆటంకం కలుగుతుందంటున్నారు.
ఆగస్టుపైనే ఆశలు
సాధారణంగా గోదావరికి ఆగస్టు మధ్యమంలో వరద ఉధృతంగా వచ్చే అవకాశం ఉండడంతో ఇటు పులసల ప్రియులు, అటు జాలర్లు ఆశలు పెట్టుకొన్నారు. అయితే, ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాభావ పరిస్థితులు ఉండడంతో వారి ఆశ నిరాశగా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి.
మార్కెట్‌ను ముంచేస్తున్న ఇలసలు
పులస జాడ అంతంతమాత్రంగానే ఉండడంతో జాతీయ రహదారిలో పులసల స్థానంలో ఒడిస్సా నుంచి వచ్చిన ఇలసలు ముంచేస్తున్నాయి. అసలైన పులస ఎర్రనీరులో ఈదుకొంటూ వచ్చినపుడు పులసపై ఎర్రటి జాడ కనిపిస్తూ ఉంటుంది. దీనిని గుర్తించి తీసుకోవలసి ఉంటుంది. పులసలు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి ప్రారంభమై ఆత్రేయపురం, విజ్జేశ్వరం, జొన్నాడ ఆలమూరు, సిద్ధాంతం, కోడేరు, యలమంచిలి వరకూ జాలర్ల వలకు చిక్కుతుంటాయి. పులసకు, ఇలసకు తేడాను గోదావరి వాసులు గుర్తించినా, ఇతర జిల్లాల నుంచి జాతీయ రహదారిలో పయనించే వాహనదారులు గుర్తించే అవకాశం లేదు. దీంతో ఇలసలనే పులసలుగా కొందరు అమ్మకాలు సాగిస్తున్నారు. వీటి ధరా అధికంగానే ఉండడంతో ధర చూసి పులసగా భావిస్తూ మోసపోతున్నారు. సిద్ధాంతం, జొన్నాడ ఆలమూరు వంటి ప్రాంతాల్లోనూ పులసలు అరకొరగా దొరుకుతుండడంతో కొందరికి మాత్రమే అసలైన పులస దక్కుతుంది.
గోదావరిలో జాడలేని పులస
అరకొర లభ్యతతో ఆకాశాన్నంటిన ధరలు
పుస్తులమ్ముకొనైనా పులస తినాలనే నానుడు గోదావరి జిల్లాల్లో ఉంది. కానీ ఈ ఏడాది పుస్తులమ్ముకొన్నా.. చేపల రాజు పులస దొరికే పరిస్థితి లేదు. గోదావరికి వరద ఉధృతి అంతంత మాత్రంగా ఉండడంతో పులస జాడ కనిపించడం లేదు. దీంతో పులస ప్రియులు జిహ్వను చంపుకోవాల్సి వస్తోంది. ప్రత్యేక వలలు సైతం ఎంచుకొని, నలుగురైదుగురు జాలర్లు వెళ్లినా ఒకటి రెండు మాత్రమే చిక్కడంతో గిట్టుబాటు కాక జాలర్లు సైతం తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
కూరా ప్రత్యేకమే
పులస కూర తయారీ ప్రత్యేకమే. సాధారణంగా చేపల కూర ఒకటి రెండు రోజులు మించి ఉండే అవకాశాలు ఉండవు. అయితే, పులస కూర వారంకు పైగా నిలువ ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగానే తయారీ చేస్తుంటారు. పులస కూర తయారీలో వెన్నతో పాటు, ఆవకాయ ఊట, కుమ్ముడు ఆముదం వేసి వండుతారు. దీంతో పులస ముక్క కన్నా, పులుసే అమోఘమంటూ లొట్టలు వేసుకొని మరీ తింటారు పులస ప్రియులు.

ముఖం చాటేసిన పులస

ముఖం చాటేసిన పులస