
కారు ఢీకొని ఆటో డ్రైవర్ మృతి
ద్వారకాతిరుమల: ముందు వెళుతున్న ఆటోను కారు అతి వేగంగా ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ తీవ్ర గాయాలపాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ద్వారకాతిరుమల మండలం, లక్ష్మీపురంలోని విర్డ్ ఆస్పత్రి సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం. పెదవేగి మండలం కవ్వగుంటకు చెందిన చోదిమెళ్ళ విజయరాజు(40) ఆటో నడుపుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు మంగళవారం మధ్యాహ్నం జేఎంఆర్ హాస్పిటల్ గురించి మైక్ ద్వారా ప్రచారం చేస్తూ, భీమడోలు నుంచి ద్వారకాతిరుమల వైపు వెళుతున్నాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి చైన్నెకు చెందిన అయిత సురేష్ కారును అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ విజయరాజును స్థానికులు హుటాహుటీన ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయరాజు భార్య దేవమాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు.

కారు ఢీకొని ఆటో డ్రైవర్ మృతి