
సూర్యఘర్ పథకంపై అవగాహన కల్పించాలి
భీమవరం: ప్రతి వినియోగదారుడు సూర్యఘర్ పథకంలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని ఏపీఈపీడీసీఎల్ డైరక్టర్ టి. సూర్యప్రకాశ్ ఆదేశించారు. ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్)గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంగళవారం భీమవరం వచ్చిన ఆయన ఎస్‌ఈ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు వారి ఇళ్లపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలం ఉంటే నెడ్‌క్యాప్ ద్వారా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఏ సబ్ స్టేషన్ల పరిధిలో అంతరాయాలు వస్తున్నాయో అడిగి, వినియోగదారులకు అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్‌ను సిబ్బంది సత్కరించారు. కార్యక్రమంలో ఈఈ ఎన్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.