
పిల్ల జలగలతో గొర్రెలకు ప్రమాదం
జంగారెడ్డిగూడెం: గొర్రెలు, పశువుల్లో పొట్ట జలగల వలన చాలా నష్టాలు కలుగుతాయి. అందులో ముఖ్యంగా పిల్ల పొట్ట జలగల వల్ల గొర్రెల్లో విరేచనాలు కలిగి, నీరసించి మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. కుంటలు, చెరువులు పక్కన తేమ గల ప్రాంతాల్లో నాట్లు ఉన్న ప్రాంతాల్లో నత్తలు ఉంటాయి. గొర్రెలను ఆ ప్రాంతాల్లో మేపడం వలన అవి అక్కడి నీరు తాగడం ద్వారా గొర్రెలకు ఈ వ్యాధి సోకుతుందని పశువైద్యాధికారి బీఆర్ శ్రీనివాసన్ తెలిపారు. ఇవి పొట్ట గోడల్లో స్థావరం ఏర్పాటు చేసుకుని పోషక పదార్థాలను పీల్చడం ద్వారా పశువుకు నష్టాన్ని చేకూర్చుతాయని, గొర్రెల పెంపకందారులు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.
వ్యాధి వ్యాప్తి
పొట్ట జలగల గుడ్లు పేడ ద్వారా బయటకు విసర్జించబడి, నీటిలోనికి చేరినప్పుడు గుడ్లు పగిలి అందులోని లార్వా దశ (మిరసిడియం) నత్తల శరీరంలోకి ప్రవేశించి, నత్తల్లో కొంత అభివృద్ధి చెంది సర్కేరియా దశలో బయటకు విసర్జించబడతాయి. వీటితో కలుషితమైన గడ్డి, నీటి ద్వారా గొర్రె శరీరంలోనికి ప్రవేశించి, ముందుగా చిన్న ప్రేగుల లోపల పొరలకు చేరుకుని, పోషక పదార్థాలను ఎక్కువగా పీల్చుకుని, 3 నుంచి 5 వారాల్లో పెద్ద జలగలుగా అభివృద్ధి చెందుతాయి. రూమోన్‌లో స్థావరం ఏర్పరుచుకుని 7 నుంచి 14 వారాల తరువాత గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు పేడ ద్వారా బయటకు విసర్జింపబడి ఇతర పశువులకు వ్యాపిస్తాయి.
వ్యాధి లక్షణాలు
పిల్ల పొట్ట జలగలు చిన్న ప్రేగుల మొదటి భాగమైన డ్యుమోడినము గోడ లోపలి పొరల్లో స్థావరం ఏర్పరుచుకుని, పోషక పదార్థాలను ఎక్కువగా పీల్చుకోవడం వలన గొర్రెలు బాగా క్షీణించి, నీరసించి పోతాయి. గొర్రెల్లో ఆకలి లేమి, నీరు ఎక్కువగా తాగడం, దుర్వాసనతో కూడిన నీళ్ల విరేచనాలు, దవడ కింద భాగంలో నీరు చేరడం, శరీర కుహరంలలో నీరు చేరడం అతిసారం, రక్తహీనత లక్షణాలు కనిపిస్తాయి. దవడ కింద వాపు సాయంత్రం కనబడి ఉదయానికి తగ్గుతుంది. ఈ వ్యాధి వల్ల గొర్రెల మందల్లో 80 శాతం వరకు మరణాలు సంభవించవచ్చు. కొన్ని పర్యాయాలు పిల్ల పొట్ట జలగలు అధిక సంఖ్యలో సోకడం వల్ల నీళ్ల విరేచనాలు కలిగి అకస్మాత్తుగా చనిపోయే అవకాశం ఉంది. కంటి లోపలి మ్యూకస్ పొర రక్తహీనత వల్ల తెల్లగా పాలిపోయి ఉంటుంది.
వ్యాధి నిర్ధారణ
పిల్ల పొట్ట జలగ వ్యాధి సోకినప్పుడు పేడలో జలగ గుడ్లు కనిపించవు. కాని కొన్ని సందర్భాల్లో పిల్ల పొట్ట జలగలు పేడలో కనిపిస్తాయి. కావున వ్యాధి లక్షణాలు, శవపరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. శవ పరీక్ష చేసినప్పుడు డ్యుమోడినం లోపలి మ్యూకస్ పొర పాలిపోయి, అక్కడక్కడ రక్తపు చుక్కలు కనిపిస్తాయి. డ్యుమోడినం లోపలి మ్యూస్ పొరల నుంచి సేకరించిన పదార్ధంను సూక్ష్మదర్శిని ద్వారా పరీక్షించిన కనిపిస్తాయి.
చికిత్స
సాధారణంగా పొట్ట జలగల నివారణకు ఉపయోగించే మందుల వలన పిల్ల పొట్ట జలగల నివారణ జరగదు. వీటి నివారణకు నిక్లజమైడు 100 మి.గ్రాలు ఒక కిలో శరీర బరువుకు చొప్పున లేదా ఆక్సిక్లోజనైడు 18.7 మి.గ్రాలు ఒక కిలో శరీర బరువుకు చొప్పున రెండు రోజుల వ్యవధిలో రెండు మోతాదులు ఇవ్వాలి. అతిసారం అధిగమించడానికి రక్తంలోనికి సైలెన్‌లను ఎక్కించాలి. రక్తహీనత నివారించడానికి ఇనుపధాతువుతో కూడిన మందులు ఇవ్వాలి. కాలేయం సాధారణ స్థితికి చేరుకోవడానికి మందులు ఇవ్వాలి. బాక్టీరియా క్రిములు చేరకుండా ఉండటానికి అవసరమైతే యాంటి బయోటిక్ మందులు ఇవ్వాలి.
చెరువుల్లోని నత్తలను నాశనం చేయాలి
వ్యాధి సోకిన ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లోని నీరు తాగనీయకూడదు. అవసరమైతే చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి. పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచుకోవాలి. చెరువుల్లోని నత్తలను నాశనం చేయాలి. గొర్రెలకు సమతుల్యమైన పోషకాహారం అందించాలి. పరిశుభ్ర వాతారణం కల్పించాలి. – బీఆర్ శ్రీనివాసన్, పశువైద్యాధికారి

పిల్ల జలగలతో గొర్రెలకు ప్రమాదం