త్రుటిలో తప్పిన పెను ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

Aug 6 2025 7:04 AM | Updated on Aug 6 2025 7:06 AM

పాలకొల్లు సెంట్రల్‌: పూలపల్లి గ్రామంలో ఓ ఇంటిలో గ్యాస్‌ లీకై అగ్ని ప్రమాదం సంభవించగా సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం గ్రామంలోని గంటాలమ్మ ఆలయం వద్ద నివాసం ఉంటున్న గంట సత్తిబాబు భార్య స్వరాజ్యలక్ష్మి మంగళవారం ఉదయం వంట చేస్తుండగా గ్యాస్‌ లీకై అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే ఆమె కేకలు వేయగా స్థానికులు పరుగున వచ్చి మంటలతో ఉన్న గ్యాస్‌ బండను బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది, హెచ్‌పీ గ్యాస్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆలస్యం అయ్యి ఉంటే బండ పేలిపోయేదని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సుమారు రూ.20 వేలు ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

ఆటల పోటీలు వాయిదా

ఏలూరు రూరల్‌: జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చేపట్టిన ఆటల పోటీలు అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి బి శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. తదుపరి జిల్లా జట్ల ఎంపిక, పోటీల నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో జరిమానా

భీమవరం: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఏడుగురిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధించినట్లు భీమవరం వన్‌టౌన్‌ సీఐ ఎం.నాగరాజు మంగళవారం చెప్పారు. వన్‌టౌన్‌ పరిధిలో ఈనెల 4వ తేదీ రాత్రి ఎస్సైలు బి.వై కిరణ్‌కుమార్‌, ఎస్‌వీవీఎస్‌ కృష్ణాజి సిబ్బందితో కలిసి కొత్త బస్టాండ్‌ ప్రాంతంలో స్పెషల్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించినట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న కారు, ఆటో డ్రైవర్లతోపాటు 9 మంది మోటార్‌సైకిల్‌ వాహనదారులపై కేసులు నమోదు చేశామన్నారు. నిందితుల్లో ఏడుగురిని మంగళవారం స్పెషల్‌ జ్యుడిషియల్‌ 2వ తరగతి మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఎంవీఎన్‌ రాజారావు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారన్నారు.

వైద్యుల నిర్లక్ష్యంపై

ఆసుపత్రి వద్ద ఆందోళన

జంగారెడ్డిగూడెం: నిర్లక్ష్యంగా వైద్యం చేయడంతోపాటు తమపై దాడికి పాడ్పడ్డారని పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి వద్ద బాధితులు మంగళవారం ఆందోళన చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై షేక్‌జబీర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టి.నరసాపురం మండలం గండిగూడానికి చెందిన యర్రగొర్ల రాజేష్‌ కుమార్తె పునర్వికశ్రీ జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతుండడంతో జంగారెడ్డిగూడెంలోని ప్రైవేట్‌ వైద్యశాలకు చికిత్స నిమిత్తం ఈనెల 3వ తేదీన వచ్చారు. ఆసుపత్రి ప్రధాన వైద్యుడు కాకుండా వేరొక వైద్యుడితో గత రెండు రోజులుగా చికిత్స అందిస్తున్నారని, బాలిక కోలుకోకపోవడంతో ప్రధాన వైద్యుడిని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించడంతో పాటు, ఆసుపత్రి సిబ్బందితో కలిసి రాజేష్‌ను నిర్భంధించి కొట్టారు. బంధువుల సహాయంతో రాజేష్‌ బయటకు వచ్చి ఫిర్యాదు చేశాడని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం 1
1/1

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement