
పరాకాష్టకు పీ–4
సాక్షి, భీమవరం: పేదరిక నిర్మూలన కోసమంటూ చంద్రబాబు సర్కారు చేపట్టిన పీ–4 కార్యక్రమం వేధింపులు పరాకాష్టకు చేరాయి. సర్కారు పిలుపునకు సంపన్నుల నుంచి స్పందన రాక ఉద్యోగులను బాధ్యులను చేసే పనిలో ఉంది. మార్గదర్శులుగా మ్యాపింగ్‌కు ఒత్తిడి తెస్తోంది. పీ–4 అమలులో సర్వే లక్ష్యం చేరుకోలేదంటూ సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అట్టడుగు పేద కుటుంబాలను సంపన్నుల సాయంతో అభివృద్ధి చేసేందుకు పబ్లిక్– ప్రైవేట్ – పీపుల్ పార్టనర్‌షిప్ (పీ–4) కార్యక్రమం తెచ్చినట్టు ప్రభుత్వం చెప్పుకుంటోంది. పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 4,92,292 కుటుంబాలకు పలు వడపోతల తర్వాత 64,940 కుటుంబాలను అర్హులుగా ఎంపిక చేశారు. సంపన్నులను మార్గదర్శులుగా చేర్పించి ఆయా కుటుంబాలను వారికి అనుసంధానించాలి. దత్తత తీసుకున్న కుటుంబాలకు ఆర్థిక చేయూత, లేదా జీవనోపాధికి అవసరమైన నైపుణ్యాలను నేర్పించడం ద్వారా వారి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి.
ఉద్యోగుల పైనే భారం : బంగారు కుటుంబాలు, మార్గదర్శుల గుర్తింపు, అనుసంధానం మొత్తం బాధ్యతలను ప్రభుత్వం ఉద్యోగ వర్గాలపైనే మోపింది. ఈ నెల 15 నాటికి జిల్లాలో 15 వేల మంది మార్గదర్శులను గుర్తించాలని లక్ష్యంగా నిర్ణయించారు. పీ–4లో భాగస్వాములుగా చేరి బంగారు కుటుంబాలను బాగుచేసేందుకు కూటమి పక్షాల్లోని సంపన్న నేతలు ఆసక్తి చూపడం లేదు. శనివారం నాటికి జిల్లాలో 1,700 మంది మాత్రమే మార్గదర్శులుగా రిజిస్టర్ చేసుకున్నారు. వీరికి 35 వేల కుటుంబాలను మ్యాపింగ్ చేశారు. ఉన్నతస్థాయి నుంచి వస్తున్న ఒత్తిడితో త్వరితగతిన మిగిలిన కుటుంబాల మ్యాపింగ్ పూర్తిచేసేందుకు జిల్లా యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో ఉన్నతాధికారులు నిరంతర సమీక్షలు చేస్తున్నారు. పారిశ్రామిక, వ్యాపారవేత్తలు, పెద్ద రైతులు, రైస్ మిల్లర్స్, విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థలు, మద్యం, ఎరువుల షాపుల యజమానులు, డీలర్లు తదితర వర్గాల వారితో సమావేశాలు ఏర్పాటుచేసి మార్గదర్శులుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరుతున్నారు. పెద్దగా ఫలితం కనిపించకపోవడంతో మార్గదర్శుల భారాన్ని ప్రభుత్వం ఉద్యోగ వర్గాలపై మోపుతోంది. ఒక్కో కుటుంబాన్ని మ్యాపింగ్ చేసుకోవాలంటూ వస్తున్న ఒత్తిళ్లతో ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. నైపుణ్యాలను నేర్పించే ఆప్షన్‌లో ఒక్కో ఉద్యోగి ఒక్కో కుటుంబాన్ని దత్తత తీసుకోమంటున్నారని సచివాలయ ఉద్యోగులు అంటున్నారు. ఏడాదికి ఒక్కో ఉద్యోగి కనిష్టంగా దత్తత కుటుంబానికి రూ.5 వేలు సాయం అందించాలని, ఈ మేరకు తమ జీతం నుంచి మినహాయించుకుంటుందన్న ఆందోళన వారిని వెంటాడుతోంది.
ఆదిలోనే తిప్పికొట్టిన ఉపాధ్యాయ సంఘాలు
పీ–4 అమలులో టీచర్లను భాగస్వాములను చేసే ప్రయత్నాలను ఉపాధ్యాయ సంఘాలు ఆదిలోనే తిప్పికొట్టాయి. ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్‌కు ఏలూరు విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్రవ్యాప్తంగా సంఘ నాయకులు ఖండించారు. సంపన్నవర్గాలకు చెందిన పీ–4 అమలుకు మధ్య తరగతి శ్రేణిలో ఉండే ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల వారిపై భారం మోపడం సరికాదని, వేరే కుటుంబాలను దత్తత తీసుకుని సాయపడే పరిస్థితి ఉండదనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలంటూ ఫ్యాప్టో చురకలంటించింది. ఉపాధ్యాయ వర్గాలు ఆందోళనలకు సిద్ధంకావడంతో ఉత్తర్వులను విద్యాశాఖ వెనక్కి తీసుకుంది.
సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ : పీ–4 సర్వే లక్ష్య సాధనలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ భీమవరం మున్సిపాల్టీకి చెందిన 26 మంది సచివాలయ అడ్మిన్, ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ ఉద్యోగులకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసుల జారీచేయడం చర్చనీయాంశంగా మారింది. పింఛన్ల పంపిణీ, రకరకాల సర్వేల పేరిట క్షణం తీరిక లేకుండా పనిచేస్తుంటే నోటీసులు ఇవ్వడం సరికాదని ఉద్యోగులు వాపోతున్నారు. జిల్లాలోని మిగిలిన మున్సిపాల్టీల్లోనూ ఈ తరహా ఒత్తిళ్లు అధికంగా ఉన్నట్టు చెబుతున్నారు. పేదలకు మేలు చేయాలన్న చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉంటే నేరుగా వారిని ఆదుకోవాలని, ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరికాదని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
మార్గదర్శులుగా ముందుకురాని కూటమి నేతలు
ఉద్యోగులనే మార్గదర్శులుగా మ్యాపింగ్‌కు ఒత్తిళ్లు
భీమవరంలో 26 మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
ఎంపీడీవోలు, ఇతర అధికారులపైనా తీవ్ర ఒత్తిడి