విద్యా శక్తి కార్యక్రమం బహిష్కరిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

విద్యా శక్తి కార్యక్రమం బహిష్కరిస్తున్నాం

Aug 6 2025 6:40 AM | Updated on Aug 6 2025 6:40 AM

విద్యా శక్తి కార్యక్రమం బహిష్కరిస్తున్నాం

విద్యా శక్తి కార్యక్రమం బహిష్కరిస్తున్నాం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాల విద్యాశాఖ ప్రవేశ పెట్టిన విద్యాశక్తి అనే కార్యక్రమాన్ని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) బహిష్కరిస్తోందని ఆ సమాఖ్య నాయకులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా విద్యా శాఖాధికారి ఎం. వెంకటలక్ష్మమ్మకు మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ విద్యాశక్తి కార్యక్రమం నిర్బంధం కాదని ఇది కేవలం ఐచ్ఛికం మాత్రమేనని తెలిపినప్పటికీ కొంతమంది అధికారులు ఉపాధ్యాయులను విద్యా శక్తి కార్యక్రమం నిర్బంధంగా నిర్వహించవలసిందేనని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. డీఈఓకు మెమోరాండం ఇచ్చిన వారిలో ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్‌ జీ మోహన్‌, సెక్రటరీ జనరల్‌ ఎం.ఆదినారాయణ, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ ఆర్‌.రవికుమార్‌, బీ రెడ్డి దొర, కేఆర్‌ పవన్‌ కుమార్‌, ఐ.రమేష్‌ ఉన్నారు.

ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ ఏర్పాటుకు అనుమతులు

ఏలూరు(మెట్రో): జిల్లాలో వివిధ మొబైల్‌ టెలికాం కంపెనీలకు 4జీ నెట్‌వర్క్‌కు సంబంధించి ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ ఏర్పాటుకు అనుమతులు వెంటనే మంజూరు చేస్తామని కలెక్టర్‌ కె. వెట్రిసెల్వి రాష్ట్ర సమాచార శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌కు తెలిపారు. సెక్రటేరియట్‌ నుండి జిల్లా కలెక్టర్లతో కాటంనేని భాస్కర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైబర్‌ కేబుల్‌ అనుమతులను వెంటనే పరిశీలించి, నిబంధనల మేరకు అర్హత కలిగిన వాటికి వెంటనే మంజూరు చేయాలన్నారు.

అంగన్‌వాడీలపై వేధింపులు ఆపాలి

ఏలూరు (టూటౌన్‌): ఫోన్లను అంగన్‌వాడీ కార్యాలయంలో అప్పగించిన వారిపై వేధింపులు మానుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌. లింగరాజు, ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడి ప్రసాద్‌ విజ్ఞప్తి చేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు తమ ఫోన్‌లను ఐసీడీఎస్‌ కార్యాలయాల్లో అప్పగించారన్నారు. ఫోన్లు పనిచేయడం లేదని చెప్పినా వినకుండా టార్గెట్ల పేరుతో తీవ్రంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెట్‌ సిగ్నల్స్‌ లేకపోవడం, సర్వర్‌ పనిచేయకపోవడం వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారుల బెదిరింపులకు అంగన్‌వాడీలు లొంగరన్నారు. సమస్య సానుకూలంగా పరిష్కరించాల్సిన అధికారులు ఇంతవరకూ స్పందించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తక్షణమే అంగన్వాడీలకు 5 జీ ఫోన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ప్రమాదాల నివారణకు ప్రణాళిక

కై కలూరు: జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా పక్కా ప్రణాళికతో అధికారులు పనిచేయాలని ఎస్పీ కె.ప్రతాప్‌ శివకిషోర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డి చెప్పారు. కై కలూరు నియోజకవర్గంలో ముదినేపల్లి నుంచి కై కలూరు వరకు జాతీయ రహదారిలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను మంగళవారం పరిశీలించారు. ప్రధానంగా ముదినేపల్లి మండలంలో జరుగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. అనంతరం కై కలూరు ట్రావెలర్స్‌ బంగ్లాలో ఎస్సీ, జేసీలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు మాట్లాడుతూ ప్రమాద మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు.

లీజు జీఓ రద్దు చేయాలి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆర్టీసీ స్థలాన్ని లులూ షాపింగ్‌ మాల్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓను రద్దు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు స్పష్టం చేశారు. మంగళవారం ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో రీజనల్‌ కార్యదర్శి బీ రాంబాబు మాట్లాడుతూ విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న 4.15 ఎకరాలను లులూ షాపింగ్‌ మాల్‌కు ప్రభుత్వం కట్టబెట్టడం దారుణమన్నారు. లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేయడమంటే సంస్థను ప్రైవేట్‌ పరం చేయడమేనని, ఉద్యమాల బాట పట్టక ముందే జీఓ రద్దు చేయాలని కోరారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా సరే ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. ఆర్టీసీని కాపాడుకొనేందుకు పోరాటాలకు సిద్ధంగా ఉంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement