కొబ్బరి ధరహాసం | - | Sakshi
Sakshi News home page

కొబ్బరి ధరహాసం

Jul 30 2025 8:44 AM | Updated on Jul 30 2025 8:44 AM

కొబ్బ

కొబ్బరి ధరహాసం

● రికార్డు స్థాయిలో నీటి కొబ్బరి, కురిడీ ధరలు ● తమిళనాడు, కేరళలో పంట తగ్గడమే కారణం ● వరుస పండుగలతో పెరిగిన కొబ్బరి ధరలు ● కొబ్బరి వ్యాపారులు, రైతుల్లో హర్షం

అవగాహన అవసరం

ప్రస్తుతం మార్కెట్‌ ధర అత్యధికంగా ఉంది. రైతులు బాగా తయారైన కాయలను దింపు తీయించడం ద్వారా ఽమంచి ధరను పొందవచ్చు. ప్రభుత్వం కోకోనట్‌ పరిశోధన కేంద్రాలను ఏర్పాటుచేసి మన ప్రాంతంలో కొబ్బరి రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి.

– మైగాపుల రాంబాబు, కోకోనట్‌ సంఘ మాజీ అధ్యక్షుడు, పాలకొల్లు

ప్రభుత్వం శ్రద్ధ వహించాలి

ప్రస్తుతం ధరను బట్టి రైతుల్లోనూ కొబ్బరి పంటపై ఆసక్తి పెరుగుతుంది. ధరలు లేవని సరైన అవగాహన లేక కొందరు కొబ్బరి చెట్లను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వమే ప్రత్యేక శ్రద్ధ వహించి రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

– కఠారి నాగేంద్రకుమార్‌, పాలకొల్లు కోకోనట్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌, పాలకొల్లు

పాలకొల్లు సెంట్రల్‌: గత రెండు నెలలుగా రికార్డు స్థాయిలో కొబ్బరి ధరలు పలుకుతుండడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలో పచ్చి కొబ్బరి, కురుడి, కొత్త కొబ్బరి కాయ దొరకడమే గగనంగా మారింది. ప్రస్తుతం శ్రావణమాసం ప్రారంభం కావడంతో మార్కెట్లో కొబ్బరికి డిమాండ్‌ మరింత పెరగడంతో ఇక్కడ కూడా పంటకు కొరత ఏర్పడింది. ధర ఉన్నా సరుకు అందుబాటులో లేకపోవడంతో ధర మరింత పెరిగే అవకాశం ఉంటుందని రైతులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో దాదాపుగా 80 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ఏలూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, రెడ్డిసీమ, కోరుమామిడి, చింతలపూడి, ద్వారకాతిరుమల, దేవరపల్లి, పెదవేగి, కొవ్వూరు, నల్లజర్ల, గోపాలపురం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు, పాలకొల్లు, మొగల్తూరు, పేరుపాలెం వంటి ప్రాంతాల్లో కొబ్బరి పంట అధికంగా కొనసాగుతుంది.

జోరుగా కొబ్బరి మార్కెట్‌

శ్రావణమాసానికి ముందుగానే జిల్లాలో కొబ్బరి మార్కెట్‌ జోరందుకుంది. కురుడి కొబ్బరికై తే ధర రికార్డు స్థాయిలో ఉండడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్‌లో పాత కాయల్లో పెద్ద సైజు గిలక కాయలు వెయ్యి కాయల ధర రూ.24,500, చిన్న సైజు కాయలు రూ.20 వేలు వరకూ మార్కెట్‌ జరిగింది. అలాగే కొత్త రకం కాయల్లో పెద్ద (అరవైబత్తి) సైజు రూ. 22,500, చిన్న సైజు కాయలు రూ.18 వేలు వరకూ ఉంది. నెంబర్‌ కాయ (అతి చిన్న సైజు) కొబ్బరి రూ.15 నుంచి 18 వేలు పలుకుతుంది. కురుడీ కాయలో పెద్ద సైజు ధర రూ.30 వేల గటగట సైజు రూ.27 వేల వరకూ పలుకుతోంది.

పండుగల ప్రభావం

మన రాష్ట్రం నుంచి గుజరాత్‌, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌, ఉత్తర ప్రదేశ్‌, డిల్లీ, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఒరిస్సా, హర్యానా వంటి అనేక రాష్ట్రాలకు ఇక్కడ నుంచి ఎక్కువగా ఎగుమతులు అవుతుంటాయి. శ్రావణమాసంలో దాదాపుగా ఈ ఒక్క నెలలోనే శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు, శుక్ల ఏకాదశి, బహుళ ఏకాదశి, దూర్వాగణపతి హోమం, వరలక్ష్మీ వ్రతం, సంకట హర చతుర్థి, శ్రీకృష్ణాష్టమి, మాసశివరాత్రి రాఖీ పౌర్ణమి, పోలాల అమావాస్య, నాగ పంచమి, ఆగస్టు నెలలో వినాయకచవితి రావడంతో ఆయా రాష్ట్రాల్లో పండుగ వాతావరణం అంతా ఈ నెలలోనే ఉండడంతో కొబ్బరి మార్కెట్‌ నిలకడగా ఉండడానికి కూడా ఒక కారణంగా చెబుతున్నారు.

కాయల్లో నాణ్యత ఉండాలి

రైతులు దింపు తీసేటప్పుడు నాణ్యమైన నిక్కర్చి కాయలను మాత్రమే దింపు తీయాలి. బరువైన కాయలు దింపు తీయడం వల్ల అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేక కాయలు కుళ్లిపోతుంటాయి. నిక్కర్చి కాయలు బరువు తక్కువ ఉండే బాగా తయారైన కాయలు దింపు తీయడం వల్ల మార్కెట్‌ ధర కూడా ఎక్కువగా ఉంటుందని వ్యాపారస్తులు చెబుతున్నారు. దింపు తీసే కార్మికులు అందుబాటులో లేకపోవడంతో రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. కొబ్బరి విజ్ఞాన కేంద్రాలు ఉమ్మడి పశ్చిమలో పెదవేగిలో తూర్పు గోదావరిలో అంబాజీపేటలోనే ఉన్నాయి. కొబ్బరి పంటపై రైతుల్లో అవగాహన కల్పించేలా ప్రభుత్వం అవగాహనా సదస్సులు ఏర్పాటుచేయాలి.

తమిళనాడు, కేరళలో దిగుబడులు లేకపోవడమే

ప్రస్తుతం మార్కెట్లో కొబ్బరి ధరకు ఇంత జోష్‌ రావడానికి ప్రధాన కారణం తమిళనాడు, కేరళలో కొబ్బరి దిగుబడి తగ్గడమే. ఇటీవల వేసవిలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కొబ్బరి బొండాల వ్యాపారం జోరుగా కొనసాగడంతో నేడు పంట దిగుబడి తగ్గి మన రాష్ట్రంలో కొబ్బరికి డిమాండ్‌ పెరిగింది. అందువల్ల గుజరాత్‌, ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు మన ప్రాంతం నుంచే కొనుగోలు చేయాల్సి రావడంతో ధరలు ఆకాశాన్నంటాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సీజన్‌లో రోజుకు సుమారు 80 నుంచి 100 లారీల వరకూ ఎగుమతులు జరుగుతుంటాయి. అన్‌ సీజన్‌లో అయితే జిల్లాలో రోజుకు సుమారు 30 నుంచి 40 లారీల వరకూ ఎగుమతులు జరుగుతుంటాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం సీజన్‌ అయి ఉండి ధర కూడా అధికంగా ఉన్నా సరుకు లేకపోవడం వల్ల రోజుకు సుమారు 60 నుంచి 80 లారీలు వరకూ ఎగుమతులు అవుతున్నాయని అంటున్నారు.

కొబ్బరి ధరహాసం 1
1/3

కొబ్బరి ధరహాసం

కొబ్బరి ధరహాసం 2
2/3

కొబ్బరి ధరహాసం

కొబ్బరి ధరహాసం 3
3/3

కొబ్బరి ధరహాసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement