
ఫసల్ బీమా.. రైతులకు ధీమా
చింతలపూడి, దెందులూరు : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే వరకు అన్నదాతలకు ఆందోళన తప్పడం లేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతన్నలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ధీమానిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలతో పంటలకు నష్టం వాటిల్లితే కర్షకులకు ఇబ్బంది లేకుండా బీమా వర్తించేలా ఈ పథకాన్ని రూపొందించినట్లు సహాయ సంచాలకులు వై సుబ్బారావు, దెందులూరు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరాజు తెలిపారు. బీమా ప్రీమియం చెల్లించేందుకు వరి పంటకు ఆగస్టు 15 వరకు సమయం ఉండగా మినుముల పంటకు మాత్రం ఈనెల 31 వరకు మాత్రమే గడువు ఉందని, రైతులు త్వరపడాలన్నారు.
రైతులకు కలిగే ప్రయోజనాలు
ఖరీఫ్‌లో ఆహార ధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనె గింజలు పండించే రైతులు ఎకరానికి రూ.840 చెల్లించాలి. వరి పంటకు నష్టం సంభవింస్తే ఎకరానికి రూ.42 వేల వరకు బీమా పొందే అవకాశం ఉంటుంది. మినుముల పంటకు రూ.300 చెల్లించాల్సి ఉండగా రూ.20 వేల వరకు బీమా పొందవచ్చు. రుణాలు తీసుకోని రైతులు, కౌలు రైతులు కూడా బీమా కట్టుకోవచ్చు.
బీమా వర్తింపు ఇలా..
ముంపు, చీడపీడలు, తుపాన్లు, అగ్ని ప్రమాదాలు, వడగళ్లు, పెను గాలుల ధాటికి పంట నష్టపోయినప్పుడు ఫసల్ బీమా వర్తిస్తుంది. అదేవిధంగా పంట కోసి పనలపై ఉన్నప్పుడు అకాల వర్షాలు, తుపాన్లు కారణంగా పంట దెబ్బతిన్న ఘటనల్లో కూడా బీమా వర్తింపచేశారు. ఒకవేళ తుపాన్లు, వరదలు సంభవించినప్పుడు పంట ముంపుకు గురైతే 48 గంటల్లోగా సంబంధిత బ్యాంక్ వారికి, బీమా కంపెనీకి, వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం అందించాలి.
గ్రామం యూనిట్‌గా..
గ్రామంలో పండే ప్రధాన పంటను గ్రామం యూనిట్‌గా పరిగణిస్తారు. ఏలూరు జిల్లాలో వరి పంటను గ్రామం యూనిట్‌గా గుర్తించారు. పంట ముంపుకు గురైనప్పుడు, వడగళ్ల వానలకు దెబ్బ తిన్నప్పుడు బీమా వర్తిస్తుంది. 50 శాతానికి పైగా పంట దిగుబడి నష్టం జరిగితే నిబంధనల మేరకు నష్టాన్ని అంచనా వేసి 25 శాతం బీమా సొమ్మును వెంటనే చెల్లిస్తారు. రైతులు కూడా అధిక వర్షాలు, లేదా అనావృష్టి పరిస్థితులు సంభవించినప్పుడు 7 రోజుల్లోగా ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇదికాక వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కూడా అమల్లో ఉంది. రైతులు ఈ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారులు విజ్ఞప్తి చేశారు.