
భారీగా సెల్‌ఫోన్ల రికవరీ
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీస్ శాఖ మరోసారి భారీఎత్తున సెల్‌ఫోన్లు రికవరీ చేసింది. 16వ దఫాలో ఏకంగా 480 సెల్‌ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించింది. మంగళవారం ఏలూరు అమీనాపేట సురేషచంద్ర బహుగుణ కళ్యాణమండపంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ విలేకరుల సమావేశంలో బాధితులకు వారి సెల్‌ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులు సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్) పోర్టల్‌లో చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఏలూరు సీసీఎస్, సైబర్ క్రైమ్, పోలీస్ విభాగాలు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి సెల్‌ఫోన్లను రికవరీ చేశారని, వీటి విలువ మార్కెట్‌లో సుమారుగా రూ.57.60లక్షలు ఉంటుందన్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా, ఎన్‌టీఆర్, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలతోపాటు తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శివకిషోర్ చెప్పారు. చోరీకి గురైన వస్తువు కొనుగోలు చేయటం, విక్రయించటం, దాచిపెట్టటం ఐపీసీ 2023లో 317 సెక్షన్ మేరకు శిక్షకు అర్హులని, ఈ నేరానికి గరిష్టంగా మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారని ఎస్పీ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకూ సుమారుగా 3,456 సెల్‌ఫోన్లు రికవరీ చేశామనీ, ఈ సెల్‌ఫోన్ల విలువ సుమారుగా రూ.5 కోట్ల 33 లక్షల 35 వేల 684గా ఉందని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్, సీసీఎస్ సీఐ వెంకటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
16వ దఫా 480 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేత
విలువ రూ.57.60 లక్షల అని అంచనా