
అదృశ్యమైన యువకుడు శవమై తేలాడు
ద్వారకాతిరుమల: ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైన యువకుడు పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువలో శవమై కనిపించాడు. వివరాల్లోకి వెళితే. మండలంలోని కొమ్మర గ్రామానికి చెందిన పొద్దుటూరి శ్యామ్(21) గత రెండేళ్లుగా ద్వారకాతిరుమలలోని ఈకామ్ ఎక్స్‌ప్రెస్ కొరియర్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. గత ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి నుంచి బైక్‌పై వెళ్లిన శ్యామ్ తిరిగి ఇంటికి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద వెదికినా ఫలితం లేదు. దాంతో శ్యామ్ తల్లి సంకురమ్మ సోమవారం స్థానిక పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, హెడ్ కానిస్టేబుల్ దుర్గారావు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా మంగళవారం పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువలో మృతదేహం లభించగా అది శ్యామ్‌గా గుర్తించారు. భీమడోలు సీఐ యుజే విల్సన్, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్, సిబ్బంది శ్యామ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిస్సింగ్ కేసును అనుమానాస్పద మృతిగా మార్పుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. శ్యామ్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అతడికి తల్లి, ఒక అన్నయ్య ఉన్నారు.
పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువలో యువకుడి మృతదేహం లభ్యం

అదృశ్యమైన యువకుడు శవమై తేలాడు