పీకల మీదకొచ్చింది!

Sakshi Editorial On Global temperatures and climate change

ముప్పు ముంచుకొచ్చినప్పుడు కాని మేలుకోకపోతే కష్టమే. పరిస్థితి చూస్తే అలానే ఉంది. పర్యావరణ మార్పులపై సంబంధిత పక్షాల సదస్సు తాజా సమావేశం (కాప్‌–28) ఈ నెలాఖరు నుంచి డిసెంబర్‌ 12 దాకా దుబాయ్‌లో జరగనుంది. ఏటేటా ఐరాస ఆధ్వర్యంలో ఇది మొక్కుబడి తంతుగా మారిపోతున్న వేళ కొద్దిరోజులుగా వివిధ నివేదికలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. ఇప్పటికే పరిస్థితి విషమించిందని వెల్లడిస్తున్నాయి.

రోజువారీ సగటు ప్రపంచ ఉష్ణోగ్రతలు తొలి సారిగా ఈ నవంబర్‌ 17న పారిశ్రామికీకరణ మునుపటి హద్దు దాటి 2 డిగ్రీల సెల్సియస్‌ పెరిగా యన్న వార్త ఆందోళన రేపుతోంది. పుడమిపై కర్బన ఉద్గారాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు తాము పెట్టుకున్న లక్ష్యాల గురి తప్పుతూనే ఉన్నాయని స్పష్టమవుతోంది. ఎప్పటికప్పుడు పర్యావరణ పరిరక్షణకు ప్రతిన చేస్తున్నా, నష్టనివారణకు నిధుల కొరత పీడిస్తూనే ఉంది.

ఆహార అభద్రత మొదలు వ్యాధుల దాకా అనేక రకాలుగా వాతావరణ మార్పులు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతున్నాయి. ప్రజారోగ్యంలో దశాబ్దాలుగా సాధించిన ప్రగతిని దెబ్బ తీస్తున్నాయి. ఆ నేపథ్యంలో వాతావరణ మార్పులపై తాజా నివేదికలు అలజడి సృష్టిస్తున్నాయి. పుడమి మీది ఒక శాతం అత్యంత ధనికులే మొత్తం ప్రపంచ జనాభాలోని 66 శాతం మంది కలగజేసేటంత భూతాపానికి కారణమని ఆక్స్‌ఫామ్‌ తాజా నివేదిక తేల్చింది.

ఇక, ‘కౌంట్‌డౌన్‌ ఆన్‌ హెల్త్‌ అండ్‌ క్లైమేట్‌ ఛేంజ్‌’ అంటూ గత వారం లాన్సెట్‌ వెలువరించిన 8వ వార్షిక నివేదిక ప్రజారోగ్యం, ఆరోగ్య రక్షణ వ్యవస్థలపై పడే ప్రభావాన్ని కళ్ళకు కట్టింది. పర్యావరణ మార్పుకు ప్రధాన కారణాలైన శిలాజ ఇంధనాల వినియోగం లాంటి వాటికి అడ్డుకట్ట వేయకుంటే, ప్రజల ఆరోగ్యానికే పెను ప్రమాదమని లాన్సెట్‌ నివేదిక హెచ్చరిస్తోంది.

భారత్‌కు సంబంధించి ఈ నివేదిక చెప్పిన అంశాలు, చేస్తున్న హెచ్చరికలు ఆలోచన రేపుతున్నాయి. మన దేశంలో 1986 – 2005 మధ్య కాలంతో పోలిస్తే, 2018 – 2022 మధ్య కాలంలో సగటు వేసవి ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్‌ పెరిగాయట. ఇప్పటికే ఈ అధిక ఉష్ణోగ్రత పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ఆరోగ్యాన్నీ దెబ్బ తీస్తోంది. ఈ వాతావరణ పరిస్థితులు మలేరియా, డెంగ్యూ కేసుల్ని పెంచుతున్నాయి. అలాగే సముద్రతీర ప్రాంతాల్లో గ్యాస్ట్రో ఎంటరైటిస్, సెప్సిస్, కలరాలకు సానుకూలంగా తయారవుతున్నాయి.

అలాగే, ‘బ్రోకెన్‌ రికార్డ్‌’ శీర్షికన ఐరాసా వెల్లడించిన తాజా నివేదిక సైతం పరిమితులు దాటి గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదల పెరిగిన కథను వివరించింది. వెరసి, ఉష్ణోగ్రతలు పారిశ్రామికీరణకు ముందు స్థాయి కన్నా 2 డిగ్రీలు, వీలుంటే 1.5 డిగ్రీలు మించి పెరగరాదని 2015 నాటి ప్యారిస్‌ ఒప్పందం (పీఏ)లో చేసుకున్న బాసలు చెరిగిపోయేలా కనిపిస్తున్నాయి. నికరంగా కర్బన ఉద్గారాలు లేని ‘నెట్‌ జీరో’కు కట్టుబడతామని అనేక దేశాలు మాట ఇస్తున్నా, అది ‘విశ్వసనీయంగా’ లేదని తాజా నివేదిక తేల్చేసింది. 

భూతాపం పెంపును 1.5 డిగ్రీల లోపలకు నియంత్రించే అవకాశాలు నూటికి పద్నాలుగు వంతులేనట! 2021తో పోలిస్తే 1.2 శాతం ఎక్కువగా 2022లో ప్రపంచమంతా కలసి 57.4 బిలియన్ల కర్బన ఉద్గారాలను వెలువరించిందని లెక్క. అలాగే, కరోనాలో 4.7 శాతం తగ్గిన ఉద్గారాలు ఈ ఏడాది మళ్ళీ కరోనా ముందు స్థాయికి చేరిపోవచ్చని అంచనా. నిజానికి, పర్యావరణ మార్పు, ధనిక – బీద అసమానతలు విడదీయరాని జంట.

ప్రధానంగా ధనిక దేశాల పాపానికి పేద దేశాలు బలి అవుతున్నాయి. పర్యావరణ మార్పు ప్రభావాన్ని మోస్తున్నాయి. ధనిక దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించాలనీ, చేసిన నష్టానికి పరిహారం చెల్లించాలనీ కాప్‌28 లాంటి చోట్ల పేద దేశాలు ఒత్తిడి తెస్తున్నది అందుకే. కానీ, అతి తక్కువ సంఖ్యలోని ఆ ధనిక దేశాలే ప్రపంచ పర్యావరణ విధానాన్ని నిర్ణయిస్తుండడంతో పరిష్కారం దిశగా అడుగులు పడడం లేదు. 

ఈజిప్ట్‌లో నిరుడు కాప్‌27 సదస్సులో ‘నష్ట పరిహార నిధి’ని ఏర్పాటు చేయాలంటూ ఒప్పందం కుదిరింది. స్వీయ కర్బన ఉద్గారాలు తక్కువే అయినా ధనిక దేశాల ఉద్గారాలతో నష్టపోతున్న బీద దేశాలను పర్యావరణ మార్పు ప్రభావాల నుంచి కాపాడేందుకు ఈ నిధిని ఉద్దేశించారు. ఆలోచన మంచిదైనా, ఆచరణకు వచ్చే సరికి ఆ నిధి ద్వారా డబ్బులు ఎవరిస్తారు, ఎవరికి ఇస్తారనేది ఇప్పటికీ తేలనే లేదు.

ఇంకా చిత్రమేమిటంటే– పర్యావరణానికి తూట్లు పొడిచే భారీ చమురు ప్రణాళికలు వేస్తున్న దుబాయ్‌లో కాప్‌28 సమావేశం జరగనుండడం! అలాగే, వాతావరణ సంక్షోభం, ప్రకృతి సంక్షోభం... ఈ రెంటినీ భిన్నమైన సవాళ్ళుగా భావిస్తూ, స్పందిస్తున్నాం. వాటి వల్ల సమాజంలో తలెత్తే సంక్షోభాన్ని అర్థం చేసుకోవడం లేదు. ప్రపంచమంతా చేస్తున్న ప్రమాదకరమైన తప్పు అదే! 

తీవ్ర వాతావరణ ఘటనలతో వర్ధమాన దేశాల్లో బాలికలకు నాణ్యమైన విద్య దెబ్బ తింటోందని ప్లాన్‌ ఇంటర్నేషనల్‌ నివేదిక మాట. పర్యావరణ బాధిత 30 దేశాల్లో ఏటా కనీసం 1.25 కోట్ల మంది బాలికలు అర్ధంతరంగా చదువుకు గుడ్‌బై చెప్పడానికి వాతావరణ మార్పులు కారణమవుతాయని ‘మలాలా ఫండ్‌’ సైతం హెచ్చరిస్తోంది. ఇలాంటి గణాంకాలెన్నో వాస్తవ పరిస్థితికి ప్రతిబింబం. అందుకే, పర్యావరణ మార్పు గురించి మాటల కన్నా చేతలు ముఖ్యం.

రానున్న దుబాయ్‌ సదస్సు లోనూ ప్యారిస్‌ ఒప్పందం తాలుకు అమలు తీరుతెన్నులపై ప్రపంచం మళ్ళీ చర్చిస్తుంది. ఈసారైనా మాటలు తగ్గించి, చేతలపై దృష్టి పెడితే మంచిది. ఎందుకంటే, పర్యావరణంపై ప్రపంచం ఇప్పటికే గాడి తప్పింది. దుష్ఫలితాలూ చూస్తోంది. తాజా హెచ్చరికలు పెడచెవిన పెడితే మరిన్ని కష్టాలు తప్పవు. ప్రపంచానికి పరిష్కారం ఎడారి దేశంలోనూ ఎండమావిగా మారితేనే మానవాళికి నష్టం. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top