ఏది సత్యం? ఏదసత్యం? | Sakshi
Sakshi News home page

ఏది సత్యం? ఏదసత్యం?

Published Mon, Jan 29 2024 12:05 AM

Sakshi Editorial On Fake News and false propaganda

‘ఏకం సత్‌ విప్రాః బహుధా వదంతి’ అనేది ఉపనిషత్‌ వాక్యం. ఉన్నది ఒకటే సత్యం. దానినే పండితులు అనేక రకాలుగా చెబుతారని దీని అర్థం. వెలుతురు ఉన్న లోకంలో చీకటి ఉన్నట్లే,వసంతం ఉన్న ప్రకృతిలో శిశిరం ఉన్నట్లే సత్యం ఉన్న ప్రపంచంలో అసత్యం కూడా ఉనికిలో ఉంటుంది. అది సహజం. ‘సత్యమేవ జయతే’– ఇది కూడా ఉపనిషత్‌ వాక్యమే! మన దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజున ఈ వాక్యాన్ని జాతీయ ఆదర్శంగా స్వీకరించాం. ‘సత్యం బ్రూయాత్‌ ప్రియం బ్రూయాత్‌/ నబ్రూయాత్‌ సత్యమప్రియం/ ప్రియంచ నానృతం బ్రూయాత్‌/ ఏష ధర్మ స్సనాతనః’– ఇది సుభాషిత శ్లోకం.

ఎప్పుడూ సత్యాన్నే పలకాలి. సత్యాన్ని ప్రియంగా పలకాలి. సత్యమే అయినప్పటికీ అప్రియంగా పలుకరాదు. ప్రియమైనదే అయినంత మాత్రాన అసత్యాన్ని పలుకరాదు. ఇదే సనాతన ధర్మం అని ఈ శ్లోకానికి అర్థం. అనాదిగా ప్రచారంలో ఉన్న ఉపనిషత్‌ వాక్యాలను, సుభాషిత శ్లోకాలను గమనిస్తే, అవన్నీ సత్యం పట్ల నిబద్ధతకు అద్దం పడతాయి. సత్యం కోసం సర్వస్వాన్నీ వదులుకున్న సత్యహరిశ్చంద్రుడి కథ మన జాతిపిత మహాత్మా గాంధీ సహా ఎందరికో ఆదర్శప్రాయం.

మరి సత్యసంధతపై ఇంత కట్టుదిట్టమైన పునాదులు ఉన్న మన దేశం నలుచెరగులా నిరంతరం సత్య వాక్కులే వినిపిస్తూ ఉండాలి కదా! సత్యమే వర్ధిల్లుతూ ఉండాలి కదా! అలా అనుకుంటే అది అమాయకత్వమే! దీపం కింద నీడలా సత్యాన్ని అంటిపెట్టుకుని అసత్యమూ ఉంటుంది. సత్యానిదే అంతిమ విజయం కావచ్చు గాక, కాని అప్పుడప్పుడు అసత్యం బలం పుంజుకుని లోకంలో అనర్థాలకు కారణమవుతుంది. 

అసత్యం తెచ్చిపెట్టే అనర్థాలకు ఉదాహరణలు మన రామాయణ, మహాభారతాల్లో దొరుకు తాయి. రామబాణం తాకినప్పుడు మాయలేడి రూపంలోని మారీచుడు ‘హా సీతా! హా లక్ష్మణా!’ అంటూ రాముడి గొంతుతో ఆర్తనాదాలు చేసి, సీతాపహరణానికి కారకుడయ్యాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మరాజు ‘అశ్వత్థామ హతః’ అని బిగ్గరగా పలికి, భేరీనాదాలు మోగే సమయంలో ‘కుంజరః’ అని గొణిగి ద్రోణాచార్యుడి మరణానికి కారకుడయ్యాడు. అబద్ధం చేసే అలజడి మార్మోగే సమయంలో మనకు మెదడు పనిచేయదు. వెనువెంటనే నిజాన్ని తెలుసుకోగల వ్యవధి ఉండదు. నిజాన్ని తెలుసుకునే వ్యవధిలోగానే అబద్ధం నానా అనర్థాలను కలిగిస్తుంది.

అసత్య ప్రచారం అట్టహాసంగా సాగుతున్నప్పుడు సత్యమేదో, అసత్యమేదో తేల్చుకోవడం దుస్సాధ్యంగా మారుతుంది. పత్రికలు మొదలయ్యాక ఆధునిక ప్రపంచంలో అసత్య ప్రచారం బలం పుంజుకోవడం మొదలైంది. అబద్ధాలకు పత్రికలు ఊతమివ్వగల అవకాశాలను తొలి తరాల్లోనే కొందరు రాజకీయవేత్తలు గుర్తించారు. పత్రికల ద్వారా అబద్ధాలను ప్రచారం చేయడాన్ని హిట్లర్‌ అనుయాయి గోబెల్స్‌ ఒక కళలా సాధన చేశాడు. ‘ప్రజాభిప్రాయాన్ని మలచే కార్యక్రమాన్ని పర్యవేక్షించే పూర్తి అధికారం రాజ్యానికి ఉంది’ అనేది గోబెల్స్‌ జ్ఞానగుళిక.

రెండో ప్రపంచ యుద్ధకాలంలో నాజీ నిరంకుశ రాజ్యానికి గొంతునిచ్చిన గోబెల్స్‌ను ఆరాధించేవారు ప్రపంచంలో నేటికీ ఉన్నారు. నిజానికి ఇప్పుడు గోబెల్స్‌కు బాబుల్లాంటి వాళ్లు పుట్టుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులను చూడటం వల్లనే కాబోలు ‘ఏది పుణ్యం, ఏది పాపం/ ఏది సత్యం, ఏదసత్యం? / ఏది నరకం, ఏది నాకం?/ ఓ మహాత్మా, ఓ మహర్షీ!’ అని వాపోయాడు మహాకవి.

ఇది హైటెక్కు టమారాల యుగం. ఇది సమాచార విప్లవశకం. స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణతో ప్రపంచం పిడికిట్లో ఇమిడిపోయిన కాలం. క్షీరనీర న్యాయంగా అబద్ధాల నుంచి నిజాలను వేరు చేయగల హంసలు బొత్తిగా కరవైపోతున్న రోజులివి. నిజం వేషాన్ని ధరించిన అబద్ధాన్ని గుర్తించడం అగ్నిపరీక్షగా మారిన రోజులివి. సమాచార ప్రచారానికి ఒకప్పుడు వార్తాపత్రికలు, రేడియో మాత్రమే ఆధారంగా ఉండేవి.

ఇప్పుడు ఇరవై నాలుగు గంటలూ ప్రసారాలతో ఊదరగొడుతున్న టీవీ చానళ్లు, నిరంతర కథనాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వార్తా వెబ్‌సైట్లు, వీటికి తోడుగా సామాజిక మాధ్యమ సాధనాలు అనుక్షణం జనాల మీదకు పుంఖాను పుంఖాలుగా సమాచారాన్ని వదిలిపెడుతున్నాయి. వరద ఉద్ధృతి ఉప్పొంగినప్పుడు జలప్రవాహంతో పాటు చెత్తా చెదారం కొట్టుకొస్తుంటాయి. నిర్విరామంగా సాగే నిరంతర సమాచార ప్రవాహంలో సత్యంతో పాటు అర్ధసత్యాలు, అసత్యాలు కూడా అలాగే కొట్టుకొస్తుంటాయి. గుట్టలు గుట్టలుగా పోగుపడుతున్న అసత్యాలు, అర్ధసత్యాల అడుగున సత్యం కనుమరుగుగా ఉంటుంది.

సత్యాన్ని మరుగుపరచేలా సాగుతున్న అసత్యాల, అర్ధసత్యాల సమాచార ప్రవాహం సమాచార కాలుష్యాన్ని పెంచుతోంది. సమాచార కాలుష్యం ప్రపంచానికే పెనుముప్పుగా పరిణమిస్తోంది. అబద్ధాల రణగొణల మధ్య నిజాల గొంతు వినిపించకుండా పోతున్న పరిస్థితి ఏర్పడుతోంది. తప్పుడు సమాచారం ప్రపంచ దేశాలకు ప్రమాదకరంగా మారుతోందని ఇటీవల ప్రపంచ ఆర్థిక వేదిక తన ‘గ్లోబల్‌ రిస్క్‌ రిపోర్ట్‌–2024’లో వెల్లడించింది.

అసత్యాలు, అర్ధసత్యాలతో హోరెత్తిస్తున్న తప్పుడు సమాచారం ప్రపంచ దేశాల్లో ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించడమే కాకుండా, రాజకీయ అస్థిరతకు, అశాంతికి, హింసకు, ఉగ్రవాదానికి దారితీస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక సమర్పించిన ఈ నివేదిక హెచ్చరించింది. ‘సత్యమేవ జయతే’ అని జాతీయ ఆదర్శంగా చెప్పుకుంటున్న మన భారతదేశమే తప్పుడు సమాచారం వ్యాప్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవడం వర్తమాన విషాదం. 

Advertisement
 
Advertisement