చిత్తశుద్ధి లేని నిషేధం! | Sakshi Editorial On Air Polution of Vehicles | Sakshi
Sakshi News home page

చిత్తశుద్ధి లేని నిషేధం!

Jul 11 2025 1:23 AM | Updated on Jul 11 2025 1:23 AM

Sakshi Editorial On Air Polution of Vehicles

రాజ్యాంగంలోని మూడు వ్యవస్థల తాలూకు సమస్త యంత్రాంగం కొలువు తీరిన దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం మన విధాన నిర్ణేతల వైఫల్యాలకు నిదర్శనం. ఈ నెల 1 నుంచి కాలం చెల్లిన వాహనాలను రోడ్లపై తిరగనివ్వబోమని కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ (సీఏక్యూఎం) ఉత్తర్వులిచ్చింది. 

డీజిల్‌ వాహనాలు పదేళ్లకు మించి తిరుగుతున్నా, పెట్రోల్‌ వాహనాలు పదిహేనేళ్లకు మించి వినియోగిస్తున్నా వాటికి బంకుల్లో ఇంధన విక్ర యాన్ని కమిషన్‌ నిషేధించింది. మొదట దీన్ని ఢిల్లీలో అమలుచేసి, దశలవారీగా జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌) అంతటికీ విస్తరిస్తామని తెలిపింది. అందుకనుగుణంగా ఈ నెల 1న చర్యలు మొదలయ్యాయి కూడా. తొలిరోజు కాలం చెల్లిన 80 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 

450 వాహనాలకు పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలను నిరాకరించారు. అసలు ఆ బాపతు వాహనాలు బంకుల్లో ప్రవేశించిన క్షణాల్లోనే ‘మీది కాలం చెల్లిన వాహనం. ఇక్కడ ఇంధన విక్రయాలు జరపరు’ అంటూ మైకులు ఉరమటంతో జనం విస్తుపోయారు. కానీ రెండో రోజుకల్లా నిషేధం నీరుగారింది. కేవలం ఏడంటే ఏడే వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 

మూడోరోజుకల్లా అదీ లేదు. మొదటి రెండు రోజులూ నిషేధం అమలు చేసినా ఇప్పటికీ చాలామంది వాహన యజమానులకు దానిపై అవగాహన లేదంటే ప్రభుత్వ ప్రచారం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. నిబంధన అమలును నిలిపేయాలని ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం సీఏక్యూఎంను కోరటంతో అది అంగీకరించింది. 

వచ్చే నవంబర్‌ 1 నుంచి ఈ నిషేధం అమలవుతుందని తాజాగా ప్రకటించింది. ఎన్నేళ్ల నుంచి వాహనం వాడుతున్నారో తేల్చటానికి అనువైన డిజిటల్‌ ఆధారిత కెమెరాలు, సెన్సర్లు, స్పీకర్లు చాలాచోట్ల సరిగా లేవనీ, అందువల్లే ఈ వాయిదా అత్యవసరమనీ సీఏక్యూఎంకు రాసిన లేఖలో ప్రభుత్వం తెలిపింది. 

ఢిల్లీ కాలుష్యానికి కేవలం కాలం చెల్లిన వాహనాలే కారణమా... కాలుష్యంలో వాటి వాటాయే అధికమా అని ప్రశ్నిస్తున్నవారు లేకపోలేదు. ఆ విచికిత్స మాట అటుంచి, ఏ చట్టమైనా మన దేశంలో ఎలా విఫలమవుతుందో చెప్పటానికి కేవలం ఈ రెండు రోజుల నిషేధమే రుజువు. నిషేధం మొదలయ్యాక పెద్దయెత్తున నిరసనలు పెల్లుబికాయి. 

ఇక చేసేది లేక ఆదరా బాదరాగా ఢిల్లీ ప్రభుత్వం సీఏక్యూఎంను ఆశ్రయించటం, అది వెంటనే అంగీకరించటం పూర్తయింది. కాలం చెల్లిన వాహనాలను నిలిపేయాలన్నది ఇప్పటి ఆలోచన కాదు. 2018లో సుప్రీంకోర్టే ఒక తీర్పులో ఈ సూచన చేసింది. దాన్ని అమలు చేస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. 

అధికారిక అంచనా ప్రకారం, ఢిల్లీలో కాలం చెల్లిన వాహనాల సంఖ్య 60 లక్షలు! ఢిల్లీలోని అయిదు ప్రాంతాలు– గురుగ్రాం, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతంబుద్ధ నగర్, సోనిపట్‌లలో వాహనాల తాకిడి అధికమని ఆ అంచనా చెబుతోంది. 

రాజధాని నగరంలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఇంతవరకూ అమలు చేసిన ఏ విధా నమూ విజయవంతమైన దాఖలా కనబడలేదు సరిగదా... మొన్న మార్చిలో విడుదలైన గత ఏడాది ప్రపంచ వాయు కాలుష్య నివేదిక ప్రపంచంలోని కాలుష్య నగరాల్లో ఢిల్లీది రెండో స్థానమని ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన మార్గదర్శకాల ఆధారంగా రూపొందిన ఈ నివేదిక ఢిల్లీ వాతావరణంలో సాధారణ స్థాయికన్నా 21 రెట్లు అధికంగా సూక్ష్మ ధూళి కణాలున్నాయని తేల్చింది. 

ఇంకా విషాదమేమంటే, అంతకు ముందు ఏడాది కన్నా 2024లో ఈ కాలుష్యం 6 శాతం పెరిగింది. ఢిల్లీలో సాధారణంగా ప్రతి యేటా నవంబర్‌ నెలకల్లా వాయు కాలుష్యం గురించిన చర్చ మొదలవుతుంది. అప్పటికల్లా శీతగాలుల తాకిడి మొదలై వాతావరణంలో కాలుష్యం నిలకడగా ఉండిపోతుంది. ఈసారి రెండు రోజుల నిషేధం ప్రహసనం వల్ల ముందే ఆ చర్చ ప్రారంభమైంది. 

ఏ విధానమైనా అమలు చేసేముందు దాని అమలుకు సంబంధించిన మౌలిక సదుపాయా లెలా ఉన్నాయో ప్రభుత్వాలు సమీక్షించుకోవాలి. ఒక్క మానెసర్‌ ప్రాంతంలోని ఒక కేంద్రం తప్ప ఢిల్లీ మొత్తంలో ఎక్కడా ప్రామాణికమైన కేంద్రాలు లేవని నిపుణులు చెబుతున్నారు. కేవలం ప్రైవేటు కార్లకే నిబంధనలు వర్తిస్తాయన్నట్టు రవాణా విభాగం ప్రవర్తించింది. 

ప్రజారవాణా బస్సులు మొదలుకొని వాణిజ్య వాహనాల వరకూ అనేకం ఢిల్లీ కాలుష్యాన్ని అపారంగా పెంచు తున్నాయి. తాజా నిషేధం వాటి జోలికి పోలేదు. ఇక కాలుష్యంలో టూవీలర్‌ల వాటా దాదాపు 25 శాతం. అసలు వాహనం మోడల్‌ని బట్టి దాన్ని కాలం చెల్లిన వాహనంగా వర్గీకరించటం అశాస్త్రీయం. వాహనాన్ని అరుదుగా వాడేవారుండొచ్చు, అతి జాగ్రత్తలు తీసుకునే వారుండొచ్చు. 

అటువంటివి కాలం చెల్లినవి ఎలా అవుతాయి? వాహనం సాంకేతికంగా తగిన ఫిట్‌నెస్‌ కలిగివుందా లేదా అనేది చూస్తే వేరుగా వుండేది. అన్నిటికన్నా ముఖ్యం – ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపర్చటం, నగరంలోని నలు మూలలకూ అన్ని సమయాల్లో విస్తృతంగా బస్సు సదుపాయం కల్పించటం. 

బస్సు కోసం రోడ్లపై గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకపోతే ఎవరైనా తడిసి మోపెడయ్యే సొంత వాహనం కోసం ఎందుకు ఎగబడతారు? వాహనాలు నానాటికీ పెరుగుతున్నాయంటే అది పాలకుల వైఫల్య పర్యవసానం. 

ఆ సంగతలా ఉంచి అసలు కాలం చెల్లిన వాహనాలను ఏం చేయదల్చుకున్నారు? వాటిని వదిలించుకోవటానికి ఏం ఆలోచించారు? సమస్యలు ఇన్నివున్నప్పుడు ఈ మొక్కుబడి నిషేధాల వల్ల ప్రయోజనం ఏమిటి? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement