
గత ఐదేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రం ఆశించిన స్థాయిలో రాని గ్రాంట్ ఇన్ ఎయిడ్
వార్షిక బడ్జెట్‌లో ఏటా పెద్ద సంఖ్యలో గ్రాంట్లను చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
మార్చి నెలాఖరుకు కేంద్రం ఇస్తోంది అందులో 30 శాతం లోపే
2020–21లో చివరిసారి బడ్జెట్ ప్రతిపాదనకు మించి గ్రాంట్ ఇన్ ఎయిడ్
2021–22 నుంచి 2025 వరకు ఆశించింది రూ.1,65,349 కోట్లు.. కేంద్రం ఇచ్చింది రూ.41,114 కోట్లు..
ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో వచ్చింది రూ.1,673 కోట్లే
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రం ఆశించిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ గత కొన్నేళ్లుగా అతి తక్కువగా వస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో కేంద్రం నుంచి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశించి వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదిస్తున్న నిధులకు, ఆ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కేంద్రం ఇచ్చే మొత్తానికి పొంతన ఉండటం లేదు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఆశించిన మొత్తంలో రూ.లక్ష కోట్లకు పైగా లోటు ఉండడం గమనార్హం.
గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులను 2020–21లో చివరిసారి రాష్ట్రం ఆశించిన మేరకు కేంద్రం ఇచ్చింది. ఆ ఏడాదిలో రూ.10 వేల కోట్లు ఈ పద్దు కింద వస్తాయని అంచనా వేస్తే రూ.15 వేల కోట్ల వరకు ఇచ్చింది. దీంతో మరుసటి ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.38 వేల కోట్లు వస్తాయని అంచనా వేసి వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదించింది. కానీ, ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31 నాటికి కేంద్రం నుంచి వచ్చింది రూ.8 వేల కోట్లు మాత్రమే.
అప్పటి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధుల విషయంలో భారీ అంతరం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆశించినదాంట్లో గరిష్టంగా 30 శాతం నిధులు కూడా ఈ పద్దు కింద రావడం లేదని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.22,782.50 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి బడ్జెట్‌లో పెడితే.. తొలి ఐదు నెలల్లో (2025, ఆగస్టు 31 నాటికి) ఇచ్చింది రూ.1,673.43 కోట్లు మాత్రమే.
గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే...
గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే సాయం కింద ఇచ్చే మొత్తం అని చెప్పొచ్చు. ఈ గ్రాంట్‌ను తిరిగి ఇవ్వాల్సిన పని ఉండదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం తిరిగి చెల్లించే షరతు ఉంటుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చినా, రాష్ట్రం నుంచి ఏదైనా శాఖకు వెళ్లినా, ఎన్జీవోలు, విద్యాసంస్థలైనా ఇదే నిబంధన ఉంటుంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్యతా ప్రాజెక్టులకు ఈ పద్దు కింద కేంద్రం నిధులు ఇచ్చే వెసులుబాటు ఉంది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కూడా ఇవ్వొచ్చు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఈ నిధులను మంజూరు చేయవచ్చు. అయితే, ఈ నిధులను ఏ కారణం కోసం అయితే ఇచ్చారో వాటికి మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్రాల స్వతంత్ర ఆలోచలను దెబ్బతీసే చర్య
కేంద్ర ప్రభుత్వాల పెత్తందారీ వైఖరి కారణంగానే రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు రావడం లేదు. ఈ పద్దు కింద రాష్ట్రాలకు కేంద్రం నిధులు వస్తే తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆయా రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కానీ, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆర్థిక అధికారాల కేంద్రీకరణ మాత్రం ఏటేటా పెరుగుతోంది. రాష్ట్రాలను ఆదాయ వనరులుగా చూస్తున్నారే తప్ప సాయం చేయడం లేదు.
సెస్‌ల రూపంలో కేంద్రమే పన్నులు వసూలు చేసుకుంటోంది. ఆ పన్నుల్లో వాటా ఆశించినంతగా ఇవ్వడం లేదు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా మంజూరు చేయడం లేదు. అనేక రకాలుగా కేంద్రంపై రాష్ట్రాలు ఆధారపడే విధంగా చేయడం ద్వారా ఆయా రాష్ట్రాల స్వతంత్ర ఆలోచనను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోంది. ఈ ఆర్థిక అసమతుల్యత గతంలోనూ ఉన్నదే అయినా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పెరిగింది.
– ప్రొఫెసర్ అందె సత్యం, ఆర్థిక నిపుణులు