సాక్షి, రాజమహేంద్రవరం: అదేవిటో.. ఎన్నికల కోడ్ కూసే వేళ కూటమి నేతలకు అభివృద్ధి గుర్తొచ్చేస్తుంటుంది. గెలుస్తామో లేదోననే ఆందోళనో మరేమో తెలీదు కానీ హడావుడి శంకుస్థాపనలకు కొబ్బరికాయలు టపటపా కొట్టేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మిగిలిన ప్రజాప్రతినిధులు చేస్తున్న ఈ హడావిడి జిల్లా ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. మరో 8 నెలల్లో ప్రారంభం కానున్న పుష్కరాలకు ఎక్కడా కొత్తగా ఒక రోడ్డు కానీ, ఘాట్ కానీ నిర్మించలేదు కానీ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు శంకుస్థాపనల డ్రామాకు తెరతీశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే పావు గంటకో చోట కొబ్బరికాయ కొట్టేసి హడావిడి చేసేవారు కాదని వారంటున్నారు. మరోవైపు నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు ప్రభుత్వ బాధ్యతే అయినా ఈ హడావుడి చర్యలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆయా పనులకు పరిపాలనా ఆమోదాలు లభించాయా? టెండర్ల పరిస్థితి ఏమిటి? పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. కోడ్ అమల్లోకి రాకముందే ఓటర్లను మభ్యపెట్టేందుకు కూటమి నేతలు ఈ హడావుడి చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
నోటిఫికేషన్‌కు ముందు కొత్త డ్రామా
పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలవుతున్న వేళ జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. బుధవారం ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్ విడుదల చేయవచ్చని తెలుసుకున్న కూటమి నేతలు జిల్లాలోని నియోజకవర్గాలు, మండలాల్లో మూడు రోజులుగా వరుస శంకుస్థాపనలు చేస్తుండడం చర్చకు దారితీస్తోంది. ఇన్నాళ్లూ ముందుకు సాగని పనులు నేడు హఠాత్తుగా తెరపైకి రావడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కోడ్ అమల్లోకి రాకముందే వీలైనంతగా ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాల్లో నేతలు ఉన్నారు.
జెట్ స్పీడ్‌లో శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు
రాజమహేంద్రవరంలోని హైటెక్ బస్టాండ్ వద్ద, 15వ డివిజన్లో ఓ కాలువ విస్తరణకు, పుష్కర ఘాట్ నుంచి ఇసుక ర్యాంపు వరకు పనులు చేపడతామని మంగళవారం శంకుస్థాపనలు చేసేశారు.
● బుధవారం జేఎన్ రోడ్డు, ఏవీఏ రోడ్డులో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తామని, 1వ డివిజన్లో డ్రైనేజీ నిర్మాణానికి, క్వారీ సెంటర్ నుంచి విమానాశ్రయం రోడ్లో విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు కొబ్బరికాయలు కొట్టేశారు.
● కోటిలింగాల ఘాట్ నుంచి పుష్కరఘాట్ వరకు మరుగుదొడ్లకు యుటిలిటీ నీటి సరఫరా కోసమని, పుష్కరఘాట్ వద్ద వ్యర్థాల సేకరణ కోసమని ఎస్క్యులేటర్ ఏర్పాటుకు, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం రూ.20 కోట్లతో నిర్మిస్తామని శంకుస్థాపన చేసేశారు. కాగా ఈ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ఇంకా టెండర్లే ఖరారు కాలేదని నగరపాలక సంస్థ అధికారులే చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే బుధవారం ఒక్కరోజు పావు గంటకు ఒకచోట శంకుస్థాపనలు చేశారు.
● మరోవైపు రాజమహేంద్రవరం రూరల్లోనూ బుధవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో హడావిడి చేశారు. ధవళేశ్వరంలో ఓ కమ్యూనిటీ హాల్, బొమ్మూరులో, హుకుంపేటలో సీసీ రోడ్లు ప్రారంభించారు.
● పిడింగొయ్యిలో అభివృద్ధి పనులంటూ శంకుస్థాపనలు చేశారు. కాతేరులో ఓ పీహెచ్సీ ప్రారంభోత్సవం, అక్కడే ఓ సీసీ రోడ్డు ప్రారంభించిన తర్వాత జెట్ స్పీడ్‌తో కోలమూరులో అభివృద్ధి పనులంటూ శంకుస్థాపన చేసేశారు. మధ్యాహ్నం ఓ సీసీ రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొని తర్వాత ఐఎల్టీడీ జంక్షన్ వద్ద డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసేశారు.
● జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఇదే తరహా హడావుడి శంకుస్థాపనలు చేశారు. మరోవైపు అకస్మాత్తుగా కొన్ని ప్రాంతాలకు రుడా నుంచి నిధులు కూడా విడుదల చేయించారు. మొత్తంగా చూస్తే రూ.కోట్లాది పనులకు ఇంత శరవేగంగా ఎందుకు శంకుస్థాపనలు చేశారో తమకు తెలుసని ప్రజలు అంటున్నారు. ఎన్నికల ముందు మభ్య పెట్టాలని చూస్తున్నారని, శాసన సభ ఎన్నికల సమయంలో కూటమి నాయకుల బూటకపు హామీలు నమ్మి మోసపోయామని, మళ్లీ అలా జరగదని జనం స్పష్టం చేస్తున్నారు. కూటమి పార్టీల అభ్యర్థులకు ఓటుతో బుద్ధి చెబుతామని స్పష్టం చేస్తున్నారు.
కాయ కొట్టి.. ఫొటోకు పోజిచ్చి..
హడావిడి శంకుస్థాపనల నేపథ్యంలో కొబ్బరికాయ కొట్టడం, శిలాఫలకం ఆవిష్కరించడం, ఫొటోలు దిగడం.. వెంటనే ఆ శిలాఫలకం తీసేసి వేరే చోట భద్రపరచడం వరకే పరిమితమైతే ప్రజలకు ప్రయోజనమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చేసిన ప్రతి శంకుస్థాపనకు అంచనా వ్యయాలు, పనుల పూర్తికి కాల పరిమితి, నిధుల మంజూరు, పరిపాలనా ఆమోదాలు, ప్రారంభించే తేదీలు తదితర వివరాలు వేటికీ అధికారుల వద్ద వివరాలు లేవు.
ఎన్నికల వేళ జిల్లాలో శంకుస్థాపనల డ్రామా
మూడు రోజులుగా కొబ్బరికాయలు
కొట్టేస్తూ కూటమి నేతల హడావుడి
నియోజకవర్గానికో రూ.కోటి అంటూ ప్రచారం
పనులకు ఆమోదం.. టెండర్లపై స్పష్టత కరవు
ఓటర్లను మభ్యపెట్టేందుకే అంటున్న ప్రజలు
ఎన్నికల స్టంటే అని తేలిపోయింది
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలనూ మోసం చేసింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ప్రజల దృష్టిని మరల్చడానికే శంకుస్థాపనల డ్రామాకు తెరతీశారు. కంబాల చెరువు వద్ద రూ.8 కోట్లతో పనులు చేస్తామని చెబుతున్నారు. అసలు అది జరిగేదేనా అని ప్రశ్నిస్తున్నా. గతంలో మేం రూ.125 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. ఇన్నాళ్లూ అభివృద్ధిని విస్మరించిన సిటీ ఎమ్మెల్యే ఎన్నికలు వస్తున్నాయని హడావిడిగా శంకుస్థాపన చేసేస్తున్నారు. పుష్కరాలకు సంబంధించి ఒక్క పనీ ప్రారంభించని ప్రభుత్వం ఎన్నికల వేళ ప్రజలను మరోసారి మోసగించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజలు అంతా గమనిస్తున్నారు.
– మార్గాని భరత్‌రామ్, మాజీ ఎంపీ
ప్రజలను మభ్యపెట్టేందుకే డ్రామాలు
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి టీడీపీ కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఏదో అభివృద్ధి చేసేస్తున్నామన్నట్లు హడావిడిగా కొబ్బరికాయలు కొట్టేసి శంకుస్థాపనలు చేస్తున్నారు. అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ముందుగానే టెండర్లు పూర్తి చేసి శంకుస్థాపనలు చేసేవారు. చంద్రబాబుతో సహా ఎమ్మెల్యేల పనితీరును ప్రజలంతా గమనిస్తున్నారు. సరైన సమయంలో ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.
– గొందేశి శ్రీనువాసులు రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి


