వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించండి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించండి

Oct 15 2026 8:30 AM | Updated on Oct 15 2026 8:30 AM

రాజమహేంద్రవరం సిటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీని గెలిపిస్తే, సూపర్‌ సిక్స్‌ హామీలను చంద్రబాబు ప్రభుత్వ మెడలు వంచి ఇప్పిస్తామని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం స్థానిక వైఎస్సార్‌ సీపీ నగర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పాలనపై ప్రజా చార్జ్‌షీట్‌, ‘మా రాజమండ్రి ప్రశ్నిస్తోంది.. ఆదిరెడ్డి ఫ్యామిలీ ప్యాక్‌’ పేరుతో రూపొందించిన వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనలో ఇచ్చిన ఏ హామీనీ సక్రమంగా నేరవేర్చలేదన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ మేయర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులను గెలిపించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేను, అధికారులను నిలదీసే అవకాశం ఇవ్వాలని అన్నారు. ప్రతిపక్షంగా ప్రజలకు మేలు జరిగేలా అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. రాజమహేంద్రవరం బిడ్డగా తాను ఎంపీగా చేసిన అభివృద్ధి, తెచ్చిన నిధులు తప్ప కూటమి పాలకులు కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు. సిటీ ఎమ్మెల్యే గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లను ప్రోత్సహిస్తూ, మద్యం, ఇసుక మాఫియా, బ్రాకెట్‌ ఆటలు నడిపేవారికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. తాము ఎయిర్‌ పోర్టు, రైల్వే స్టేషన్‌, మోరంపూడి ఫ్లైఓవర్‌, కంబాలచెరువు పార్కు అభివృద్ధి, గ్లో గార్డెన్‌, అంబేడ్కర్‌– ఫూలే భవన్‌, క్వారీ సెంటర్‌లో పార్లమెంట్‌ నమూనా ఇలా చేసిన అభివృద్ధి ప్రజల కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందన్నారు. తూర్పు కాపులు, ఎస్సీలు, పద్మశాలీలు, యాదవులు, శ్రామికులకు భననాల నిర్మాణం, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించడంతో పాటు ఎంపీ ల్యాడ్స్‌ నుంచి రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల చొప్పున కోట్లాది రూపాయలు కేటాయిస్తే అతీగతి లేకుండా పోయిందన్నారు. ఆయా సామాజిక వర్గాల పెద్దలంతా కలసి వస్తే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేద్దామన్నారు. మాజీ డిప్యూటీ మేయర్‌ కొడుకు వాసిరెడ్డి బాబీ ఇళ్లకు వెళ్లి దౌర్జన్యం చేస్తున్నారని, నగర సంస్కృతిని, కీర్తిని సర్వనాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి అండదండలు చూసుకునే ఇలా రెచ్చిపోతున్నారని అన్నారు. ఇసుక మాఫియాకు హితకారిణి సమాజం చైర్మన్‌ యాళ్ల ప్రదీప్‌ డాన్‌గా ఉన్నారని, చరిత్ర కలిగిన కోటిలింగాల దేవస్థానం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కొయ్యల రమణ పేకాట క్లబ్‌లు నడిపిస్తూ బ్రాకెట్‌ ఆడిస్తున్నారని ఆరోపించారు. ఇక టీడీపీ నగర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మజ్జి రాంబాబు మద్యం మాఫియాను నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. జగనన్న పాలనలో రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో స్థలాలు కేటాయించి జగనన్న కాలనీలు నిర్మించి అన్ని సదుపాయాలు కల్పిస్తే, కూటమి ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదన్నారు. నగరంలో లబ్ధిదారులకు ఇచ్చిన 25 వేల పట్టాలకు స్థలాలు చూపించే వరకు వైఎస్సార్‌ సీపీ పోరాడుతుందన్నారు. ఇవి దొంగ పట్టాలని చెబుతున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి నిరూపించకపోతే, ఆయన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. పేదలపై కక్ష సాధిస్తూ వారి కడుపు కొట్టడం సరికాదని హెచ్చరించారు. నగరంలో ఆదిరెడ్డి కుటుంబం నుంచి తల్లి మేయర్‌, తండ్రి ఎమ్మెల్సీ, భార్య ఎమ్మెల్యేగా పనిచేశారని, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారని, ఈ 19 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారనే విషయాన్ని నగరం ప్రశ్నిస్తోందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు అజ్జరపు వాసు, దాసి వెంకట్రావు, రావిపాటి రామచంద్రరావు, పోలు విజయలక్ష్మి, మార్తి లక్ష్మి, మజ్జి అప్పారావు, సంకిస భవానీప్రియ, కాటం రజనీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ మెడలు వంచి

సూపర్‌ సిక్స్‌ ఇప్పిస్తాం

ఆదిరెడ్డి కుటుంబ 19 ఏళ్ల పాలనలో చేసింది శూన్యం

పేదలకు ఇళ్ల స్థలాలు

ఇచ్చే వరకు పోరాటం

ఎమ్మెల్యే రెండున్నరేళ్ల పాలనపై ప్రజా చార్జ్‌షీట్‌ విడుదల చేసిన

మాజీ ఎంపీ భరత్‌ రామ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement