కమలమా.. కరివేపాకా? | - | Sakshi
Sakshi News home page

కమలమా.. కరివేపాకా?

Oct 15 2026 8:30 AM | Updated on Oct 15 2026 8:30 AM

సాక్షి, రాజమహేంద్రవరం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికార భాగస్వామ్యం.. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వంటి ప్రజాప్రతినిధుల బలం అండగా నిలిచినా స్థానిక ఎన్నికల్లో పోటీకి అవకాశం లేకుండా పోయింది. తూర్పు గోదావరి జిల్లాలో బీజేపీ దుస్థితి ఇది. ఎంపీగా పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డితో పాటు ఎమ్మెల్సీగా సోము వీర్రాజు వంటి సీనియర్లు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థతో పాటు నిడదవోలు, మండపేట, కొవ్వూరు మున్సిపాలిటీల్లో పోటీకి ఆ పార్టీ నాయకులకు చంద్రబాబు అవకాశం ఇవ్వడం లేదు. పోనీ వారు సొంతగా పోటీ చేద్దామంటే రాత్రికి రాత్రే మార్చేసిన వార్డుల రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పైగా తమ సత్తా ఏంటో చూపిస్తామని బహిరంగ విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్వప్రయోజనాలు చూసుకోవడంతో పాటు వారి అసమర్థత వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కొందరు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నగరంలో వంద జెండాల పండగ చేసినా...

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థతో పాటు నిడదవోలు, మండపేట, కొవ్వూరు మున్సిపాలిటీల్లో ఏదో ఒకచోటైనా పోటీ చేసే అవకాశం దక్కుతుందని బీజేపీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. కొన్ని వార్డుల్లోనూ పోటీకి ఏర్పాట్లు చేసుకున్నారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో పోటీ చేసేందుకు వీలుగా వంద జెండాల పండుగను ఇక్కడ ఉత్సాహంగా నిర్వహించారు. ఎంపీ కూడా ఎప్పటికప్పుడు నగరంలోని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానికంగా పార్టీని బలోపేతం చేసుకోవడానికి, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి ఈ ఎన్నికలు కీలకమని భావించారు. అయితే కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారంలో టీడీపీ ఆధిపత్యం కొనసాగడంతో పాటు బీజేపీని అసలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో పోటీ చేసే అవకాశం కోల్పోయామని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

క్యాడర్‌కు దక్కని భరోసా

ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా మాత్రమే పార్టీ శ్రేణులకు ప్రజల మధ్య పనిచేసే అవకాశం, రాజకీయ గుర్తింపు లభిస్తాయి. ముఖ్యంగా మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌ స్థానాలు, కార్పొరేటర్‌ స్థానాలు స్థానిక నాయకత్వానికి కీలకం. వార్డుల స్థాయిలో ప్రజలతో సంబంధాలు పెంచుకోవడానికి, పార్టీ సంస్థాగత బలాన్ని విస్తరించుకోవడానికి ఇవి దోహదపడతాయి. అయితే కూటమి రాజకీయాల్లో భాగంగా సీట్ల కేటాయింపులు జరుగుతున్నప్పుడు బీజేపీకి ఎన్ని స్థానాలు దక్కుతాయన్న దానిపై స్పష్టత లేకపోవడం కార్యకర్తలకు నిరుత్సాహానికి గురిచేస్తోంది. కూటమి ధర్మం పేరుతో ప్రతి ఎన్నికలోనూ త్యాగాలు చేయాల్సి వస్తే తమ రాజకీయ భవిష్యత్‌ ఏమిటని కొందరు శ్రేణులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు, పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత బీజేపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలపైనా ఉంటుందని... అలాంటప్పుడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కూడా కల్పించకపోతే పార్టీని క్షేత్రస్థాయిలో ఎలా విస్తరించుకోవాలన్న ప్రశ్న కార్యకర్తల నుంచి వినిపిస్తోంది. కేంద్రం నుంచి నిధులు తీసుకుంటూ రాష్ట్రంలో మాత్రం తమను కరివేపాకులా చూస్తున్నారన్న అసంతప్తి బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

రాష్ట్ర నాయకత్వం స్వప్రయోజనాల వల్లే...

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం కల్పించడంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం అసమర్థత, స్వప్రయోజనాల వల్లే తమకు పోటీ చేసే అవకాశాలు లేకుండా పోయాయని ఆ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పుడు తమ పార్టీ బలాన్ని, స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని, కార్యకర్తల శ్రమను పరిగణనలోకి తీసుకుని సీట్ల కోసం చర్చించాల్సి అభిప్రాయపడుతున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పోటీ చేద్దామనుకునే వార్డుల రిజర్వేషన్లే రాత్రికి రాత్రి మార్చేస్తే కూటమి ధర్మం ఎక్కడుందని రగిలిపోతున్నారు. జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు కూటమికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

స్థానిక సమరంలో

బీజేపీ పోటీ ప్రశ్నార్ధకం

చంద్రబాబు ప్రభుత్వంలో

ఆ పార్టీకి కష్టకాలం

మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో

పోటీలో లేనట్టే

ప్రజా ప్రాతినిధ్యం ఉన్నా క్యాడర్‌కు దక్కని భరోసా

కేంద్రం సాయం పొందుతూ

క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యంపై ఆ పార్టీ

నాయకత్వం మండిపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement